Sumalatha: తెలుగు సినీ కార్మిక సమాఖ్య (ఫెడరేషన్), డ్యాన్సర్స్ యూనియన్ మధ్య నడుస్తున్న అంతర్గత వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. ఫెడరేషన్ నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం వద్దకు డ్యాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్‌పై ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తన భర్త జానీ మాస్టర్‌పై పనిగట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ మీడియా ముఖంగా కన్నీటిపర్యంతమయ్యారు. ఈ వివాదంపై సుమలత సూటి ప్రశ్నలు సంధించారు. “గత నెల 19వ తేదీనే జానీ మాస్టర్‌పై ఉన్న నాన్-కోఆపరేషన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఫెడరేషన్ అధికారికంగా లేఖ ఇచ్చింది. ఆ తర్వాత ఆయనెప్పుడూ మీడియా ముందుకు రాలేదు.. ఎవరి గురించీ మాట్లాడలేదు. తన పని తాను చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తిపై మళ్లీ ఎందుకు నాన్-కోఆపరేషన్ విధించారు? ఒక జాతీయ అవార్డు గ్రహీతను ఈ విధంగా పని చేయకుండా అడ్డుకోవడం, రోడ్డున పడేయాలని చూడటం మన పరిశ్రమకే అగౌరవం కాదా? ఆయన పొట్టమీద ఎందుకు కొడుతున్నారు? అసలు జానీ మాస్టర్ అంటే వల్లభనేని అనిల్‌కు ఎందుకు అంత భయం?” అని ఆమె నిలదీశారు.
డ్యాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఒక మహిళ గెలవడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆమె మండిపడ్డారు. “నేను ప్రెసిడెంట్ పదవిలో ఉండకూడదన్నదే అనిల్ కుమార్ ఏకైక లక్ష్యం. యూనియన్‌లో జరుగుతున్న అవకతవకలు, అవినీతిని నేను ప్రశ్నిస్తున్నాను. నాపై నేరుగా ఏమీ చేయలేక, నా భర్త జానీ మాస్టర్‌ను మధ్యలోకి లాగి వేధిస్తున్నారు. సినిమాల్లో పనిచేయొద్దు, టీవీల్లో పనిచేయొద్దు అంటే కార్మికులు ఎలా బతకాలి? ప్రొడ్యూసర్ల శ్రేయస్సు కోరే వ్యక్తిని కావాలనే ఇండస్ట్రీ నుంచి దూరం చేయాలని కుట్రలు పన్నుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరేషన్ తీరుపై సుమలత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఫెడరేషన్ ప్లస్ డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్’ అని టీవీల్లో లైవ్ ఇస్తూ, డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలినైన తనను పిలవకపోవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ వివాదంలో నిర్మాతల మండలి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. జానీ మాస్టర్, అనిల్ కుమార్ ఇద్దరినీ కూర్చోబెట్టి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసే కుట్రలను ఆపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఫెడరేషన్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఈ పరిణామాలు టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

