తమిళ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ ఎస్.ఎమ్.రాజు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. హీరో ఆర్య ప్రధాన పాత్రలో, పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో స్టంట్ కో-ఆర్డినేటర్‌గా పని చేస్తున్న రాజు, ఇటీవల జరిగిన షెడ్యూల్‌లో కార్ జంప్ స్టంట్‌లో పాల్గొంటుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్ర గాయాల కారణంగా ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిలించింది.
Also Read : Chiranjeevi : అనిల్ రావిపూడి సినిమాలో మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ రోల్..!
ఈ సంఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హీరో విశాల్, సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంతో స్పందించారు. “ఈ వార్త విన్న వెంటనే షాక్‌కు లోనయ్యాను. రాజు ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. చాలా ధైర్యంగా, అత్యంత నిబద్ధతతో పని చేసే వ్యక్తి. నా పలు సినిమాల్లో స్టంట్ మాస్టర్‌గా పనిచేశాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో వారి అవసరాలకనుగుణంగా పూర్తి సహాయం అందిస్తానని హామీ ఇస్తున్నాను’’ అని విశాల్ పేర్కొన్నారు.
అలాగే ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంతాపం తెలియజేశారు.‘కార్ జంపింగ్ స్టంట్ చేస్తూ ఎస్.ఎమ్.రాజు మృతి చెందడం అత్యంత విషాదకరం. మా స్టంట్ యూనియన్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ ఒక గొప్ప టాలెంటెడ్ స్టంట్ మాస్టర్‌ను కోల్పోయింది’ అంటూ తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు ఈ ఘటనపై నటుడు ఆర్య గానీ, దర్శకుడు పా.రంజిత్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ కారణంగా సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ సినిమాకు పని చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఒక స్టంట్ ఆర్టిస్టుపై కనీసం స్పందించకపోవడం బాధాకరమని కామెంట్లు చేస్తున్నారు. ఎస్.ఎమ్.రాజు తమిళ చిత్ర పరిశ్రమలో అనేక చిత్రాలకు స్టంట్ కో-ఆర్డినేటర్‌గా సేవలు అందించారు. రిస్క్ తీసుకునే ధైర్యం, పనిపై ఉన్న కమిట్‌మెంట్‌కు ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో చేసిన ఆయన స్టంట్లు ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. ఆయన మృతి చిత్రసీమకు నష్ఠమే కాదు, ఒక గొప్ప స్టంట్ లెజెండ్‌ను కోల్పోయిన విషాద ఘట్టం.
