Star Kids: ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన జయకృష్ణ నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయిందనే చర్చ ఇండస్ట్రీలో సాగుతోంది. ఈ సినిమా రిజల్ట్‌తో స్టార్ హీరోల వారసుల ఎంట్రీపై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సినీ వర్గాల అభిప్రాయం ప్రకారం.. స్టార్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ప్రారంభంలో గుర్తింపు, ప్రచారం తీసుకురాగలదే తప్ప, విజయాన్ని మాత్రం హామీ ఇవ్వదు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్‌తో పాటు సినిమాలో బలం ఉండాలని చెబుతున్నారు. అంతకంటే ముఖ్యంగా నటనతో ఆకట్టుకోవాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో త్వరలో హీరోలుగా పరిచయం కానున్న పలువురు స్టార్ వారసులపై కూడా కొత్త చర్చ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన తొలి సినిమా విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో అభిమానుల్లో ఆసక్తితో పాటు సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ ఎంట్రీపై కూడా తరచూ ప్రచారం జరుగుతోంది. నటనతో పాటు సంగీతం, ఇతర కళల్లో శిక్షణ పొందిన అకీరా ఎప్పుడు హీరోగా పరిచయం అవుతారనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో ఉంది. అయితే ఎంట్రీ ఎప్పుడైనా, ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలంటే తన ప్రతిభను నిరూపించుకోవాల్సిందేననే చెబుతున్నారు. ఇక మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ భవిష్యత్ సినీ ఎంట్రీ గురించీ తరచూ వార్తలు వస్తున్నాయి. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, ప్రతి వారసుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాల్సిందేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ మరోసారి ఒక విషయాన్ని స్పష్టం చేసిందనే అభిప్రాయం వినిపిస్తోంది. కుటుంబ నేపథ్యం అవకాశాలు కల్పించగలిగినా, సక్సెస్‌ని నిర్ణయించేది మాత్రం నటన, కథల ఎంపిక, ప్రేక్షకుల ఆదరణేనని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

