కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. “నేను మీ మోహన్ బాబు…. 1995 సంవత్సరం నాటికి తెలుగు సినిమా పరిశ్రమ వయస్సు 65 సంవత్సరాలు… 65 సంవత్సరాల్లో ఎన్నో రికార్డులను తిరగరాసి నా కెరియర్లో సువర్ణాధ్యాయం లిఖించిన చిత్రం పెదరాయుడు… 1995 జూన్ 15 ‘పెదరాయుడు’ రిలీజ్ అయిన 26 సంవత్సరాల తర్వాత… 2001 జూన్ 15న “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి సంబంధించిన లిరికల్ వీడియో రిలీజ్ కావడం శుభసూచకంగా భావిస్తున్నాను… అప్పుడు ‘పెదరాయుడు’ చిత్రానికి నిర్మాత నేనైతే ఇప్పుడు ఈ “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి నిర్మాత నా తనయుడు విష్ణు వర్ధన్ బాబు కావడం సంతోషదాయకం… ఇప్పటికే “సన్ ఆఫ్ ఇండియా” చిత్రం టీజర్ రిలీజ్ అయ్యి సంచలనాలకు తెర తీసింది. జూన్ 15 ‘పెదరాయుడు రిలీజ్’ అయిన శుభతరుణాన “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి సంబంధించి 11వ శతాబ్దపు రఘువీరా గద్యం మాస్ట్రో ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో రాహుల్ నంబియార్ స్వరంతో లిరికల్ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ పాటని మర్యాద పురుషోత్తముడైన శ్రీ రామునికి అంకితం ఇస్తున్నాను” అంటూ ‘సన్ ఆఫ్ ఇండియా’ నుంచి ‘జయ జయ మహావీర’ అనే ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టు మోహన్ బాబు ప్రకటించారు. ఇక డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.