Site icon NTV Telugu

Singer Mangli : మంగ్లీ చీటింగ్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్?

Mangli (2)

Mangli (2)

ప్రముఖ సింగర్ మంగ్లీ (సత్యవతి) భారీ వివాదంలో చిక్కుకుంది. సుమారు పది కోట్ల రూపాయల మేర తమను మోసం చేశారంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన వద్ద నుంచి గాయని మంగ్లీ రూ. 10 కోట్లు తీసుకుని, తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని ఆయన ఆరోపించారు. కేవలం తనను మాత్రమే కాకుండా, సుమారు 150 మందిని నమ్మించి ఇదే తరహాలో మోసాలకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తిరిగి అడిగినందుకు తనను తీవ్రంగా భయపెట్టారని, “నిన్ను చంపి శవం కూడా దొరకకుండా చేస్తాను” అంటూ మంగ్లీ నేరుగా బెదిరింపులకు దిగారని సుబ్బారావు పోలీసులకు వెల్లడించారు.

తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆయన విన్నవించారు. ఈ కుట్రలో కేవలం మంగ్లీ మాత్రమే కాకుండా మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మంగ్లీ (సత్యవతి) ప్రధాన నిందితురాలు, ప్రముఖ సినీ దర్శకుడు వేణు ఉడుగుల (విరాటపర్వం ఫేమ్), మంగ్లీ సోదరుడు ఈ ఆర్థిక లావాదేవీల్లో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. వీరందరూ కలిసి ఒక పథకం ప్రకారం తమను మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సాంగ్స్ తో, తన విలక్షణమైన గొంతుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మంగ్లీపై ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆరోపణలపై మంగ్లీ గానీ, దర్శకుడు వేణు ఉడుగుల గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

Exit mobile version