Shiva Kandukuri Engagement: ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి కనిపిస్తోంది. ఆ మధ్య మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం చేసుకోగా.. తాజాగా యంగ్ హీరో తేజ సజ్జా కూడా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు మరో యువ హీరో పెళ్లికి సిద్ధమయ్యారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు, హీరో శివ కందుకూరి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్, తన ప్రియురాలు శిశిర సింహను ఆయన వివాహం చేసుకోనున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో వీరి పెళ్లి జరగనుంది.
తన వివాహ విషయాన్ని శివ కందుకూరి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన కాబోయే భార్య శిశిర సింహతో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. జీవితంలో మొదలైన ఈ అందమైన ప్రయాణం జీవితాంతం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ వార్తతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే రాజ్ కందుకూరి కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. పెళ్లికి భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
శివ కందుకూరి 2020లో విడుదలైన ‘చూసి చూడంగానే’ చిత్రంతో నటుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘గమనం’, ‘మను చరిత్ర’, ‘మనమే’, ‘నవాబ్ కేఫ్’, ‘అనగనగా’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గతేడాది జియో హాట్‌స్టార్‌లో ప్రసారమైన ‘దేవిక అండ్ డానీ’ వెబ్ సిరీస్‌లోనూ మెప్పించారు. ఇందులో సుబ్బు పాత్రలో శివ తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం శివ ‘టాల్కమ్ పౌడర్’ అనే సినిమాలో నటిస్తున్నారు.

