Sheraz Mehdi: టాలీవుడ్‌లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!

  • నటుడు, నిర్మాత షెరాజ్ మెహదీ సంచలన వ్యాఖ్యలు
  • చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది
  • నలుగురు వ్యక్తుల చేతుల్లోనే థియేటర్ల వ్యవస్థ
Sheraz Mehdi Comments

Sheraz Mehdi Comments

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై నటుడు, నిర్మాత షెరాజ్ మెహదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని పరిస్థితి మన తెలుగు ఇండస్ట్రీలో ఉందన్నారు. టాలీవుడ్‌లో ఒక రకమైన మాఫియా నడుస్తోందని ఆరోపించారు. కేవలం నలుగురు వ్యక్తుల చేతుల్లోనే థియేటర్ల వ్యవస్థ ఉందని షెరాజ్ మెహదీ చెప్పుకొచ్చారు.

షెరాజ్ మెహదీ దర్శకత్వం వహించి.. హీరోగా నటించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. ఇదివరకే విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఏప్రిల్ 24న రీ-రిలీజ్ అయింది. తాజాగా తెలుగు ఫిలిం చాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో షెరాజ్ మెహదీ మాట్లాడుతూ.. తన సినిమా రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వలేదని ఆరోపించారు. ‘టాలీవుడ్‌లో ఒక రకమైన మాఫియా నడుస్తోంది. కేవలం నలుగురు వ్యక్తుల చేతుల్లోనే థియేటర్ల వ్యవస్థ ఉంది. వారు చిన్న సినిమాలను రాకుండా అడ్డుకుంటున్నారు. నా సినిమా రీ-రిలీజ్ కోసం ప్రయత్నిస్తే.. కనీసం ఒక్క థియేటర్ కూడా కేటాయించలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఈ వివక్ష నా ఒక్కడికే పరిమితం కాలేదు. ఇండస్ట్రీలో ఇది వ్యవస్థాగతంగా జరుగుతోంది. దీనిపై మేము లీగల్‌గా పోరాటం ప్రారంభించాము. ఇండస్ట్రీలోని పెద్దలకు నోటీసులు పంపాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఈ పరిస్థితిని వివరిస్తూ ఫిర్యాదు చేశాం. ప్రపంచంలో ఏ సినిమా పరిశ్రమలో లేని దారుణమైన పరిస్థితులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాయి. చివరకు బాలీవుడ్‌లో కూడా ఇంతటి వివక్ష ఉండదు’ అని షెరాజ్ మెహదీ వ్యాఖ్యానించారు. చిన్న సినిమాల మనుగడను దెబ్బతీసే విధంగా సెన్సార్ బోర్డు నిబంధనలు ఉన్నాయని, అలాగే ఏడీసీసీ వంటి అదనపు చార్జీలు భరించలేక నిర్మాతలు కుంగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.