Bhogi Release Date: చార్మింగ్ స్టార్ శర్వానంద్ అభిమానులకు గత కొన్ని నెలలుగా నిరీక్షణ తప్పడం లేదు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భోగి’ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా, ఎట్టకేలకు బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమైపోయిందని టాక్. తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తి కావడంతో, ‘భోగి’ కొత్త రిలీజ్ డేట్‌పై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో ఆగస్టు 28నే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ 1960ల నాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించేందుకు భారీగా వీఎఫ్ఎక్స్ (VFX) పనులు చేయాల్సి వచ్చింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఆ డేట్‌ను వదులుకున్నారు. ఆ తర్వాత అన్ని పనులు పూర్తి చేసుకుని, నవంబర్ 12న పాన్-ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. కానీ అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో ఆ డేట్ కూడా మిస్ అయ్యింది.
వరుస వాయిదాలతో నిరాశలో ఉన్న అభిమానులకు ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ కిక్ ఇస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుందని, సినిమాకు సెన్సార్ బోర్డు ఏకంగా ‘A’ సర్టిఫికెట్ జారీ చేసిందని టాక్. సెన్సార్ క్లియర్ అవ్వడంతో నవంబర్ 27న ‘భోగి’ని థియేటర్లలోకి దించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 1960ల నాటి ఉత్తర తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఒక ఊరి నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామా ఇది. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే ‘గంగా’ అనే అత్యంత ఇంటెన్స్, పవర్ఫుల్ పాత్రలో శర్వానంద్ కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు ఫ్యామిలీ, క్లాస్ సినిమాలతో అలరించిన శర్వా, ఈసారి ‘A’ సర్టిఫికెట్ రేంజ్లో యాక్షన్, రక్తపాతంతో థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కె.కె. రాధామోహన్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి రెండుసార్లు వాయిదా పడి, ఫైనల్‌గా నవంబర్ 27న రాబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న ఈ ‘భోగి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

