Sharvari Wagh: ‘ముంజ్యా’ తర్వాత ఒక్క హిట్ లేదు.. శార్వరి ఆశలన్నీ ఆ సినిమాపైనే!

Sharvari Wagh

Sharvari Wagh

Sharvari Wagh Latest News: బాలీవుడ్ యువ హీరోయిన్ శార్వరి వాగ్ ప్రస్తుతం కెరీర్‌లో ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ‘బంటీ ఔర్ బబ్లీ 2’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ.. ‘ముంజ్యా’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో వరుసగా ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలు అందుకుంది. అయితే ఆ విజయాన్ని కొనసాగించడంలో మాత్రం తడబడుతోంది. ముంజ్యా తర్వాత శార్వరి ఖాతాలో మరో భారీ హిట్ పడలేదు.

శార్వరి నటించిన ‘వేద’ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ ఏడాది విడుదలైన ‘మై వాపస్ ఆవూంగా’ కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో అలియా భట్ నటించగా.. శార్వరి కూడా తన నటన, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అలియాకు గట్టి పోటీ ఇచ్చేలా తన పాత్రలో రాణించినప్పటికీ.. సినిమా ఫలితం ఆమెకు ఆశించిన గుర్తింపును తీసుకురాలేకపోయింది. వరుస పరాజయాలతో వెనకపడిపోయిన శార్వరి.. ‘యే ప్రేమ్ మోల్ లియా’ సినిమాపై ఆశలు పెట్టుకుంది.

బాలీవుడ్‌లో ఫీల్‌గుడ్ ప్రేమకథలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూరజ్ బర్జాత్యా.. యే ప్రేమ్ మోల్ లియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆయుష్మాన్ ఖురానాకు జోడీగా శార్వరి నటిస్తోంది. ప్రముఖ రాజశ్రీ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత దర్శకుడు సూరజ్ బర్జాత్యా, సంగీత దర్శకుడు హిమేష్ రేషమియా కలిసి పనిచేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై బాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది విడుదల కానున్న ‘బేపర్వా’ కూడా శార్వరి కెరీర్‌కు కీలకంగా మారనుంది. యే ప్రేమ్ మోల్ లియాతో శార్వరి మళ్లీ విజయాల బాట పడుతుందా? లేదా వచ్చే ఏడాది వచ్చే బేపర్వా కోసం ఎదురుచూడాల్సి వస్తుందా? అన్నది చూడాలి.