ప్రముఖ నటి సమీరా రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. ఏప్రిల్ లో సమీరా రెడ్డితో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడ్డారు. తాజాగా సమీరా భర్త అక్షయ్ వర్దే, వారి పిల్లలు నైరా, హన్స్ కరోనా నుంచి కోలుకున్నారని, ఇప్పుడు తన కుటుంబం సురక్షితంగా ఉందని తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. “కోవిడ్ నెగెటివ్. మా కుటుంబం సురక్షితంగా ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. గత 2 నెలలు మీతో గడిపిన ఫిట్‌నెస్ ఫ్రైడే ఈ కఠినమైన సమయాన్ని గడపడానికి నాకు నిజంగా సహాయపడ్డాయి. నేను ఇంకా బలహీనంగానే ఉన్నాను. ప్రస్తుతం నా బలాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాను. నేను రోజూ వాకింగ్, యోగా. పోషకాహారం తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ జాగింగ్ / బ్రీతింగ్ / స్ట్రెచింగ్ / ఎనీ మూవ్మెంట్ కు కొంత సమయం కేటాయించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంట్లో వాకింగ్ చేయడం కూడా మీ స్టామినాను పెంచుకోవడానికి సహాయపడుతుంది. హెల్దీ ఫుడ్ తినండి, బాగా నిద్రపోండి. మీ విటమిన్లు తీసుకోండి. యోగా చేయండి, బాలెన్సుడ్ గా ఉండండి. ఎందుకంటే మీ కోసం, మీ చుట్టుపక్కల వారి కోసం మీరు ఇప్పుడే బలంగా ఉండాలి. సురక్షితంగా ఉండండి… గత కొన్ని వారాలుగా మీరు పంపిన ప్రేమకు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు’ అంటూ సుదీర్ఘ పోస్ట్ చేశారు సమీరా.
సమీరా రెడ్డి 2002లో సంజయ్ దత్, సోహైల్ ఖాన్లతో కలిసి ‘మైనే దిల్ తుజ్కో దియా’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అప్పటినుండి ఆమె డర్నా మనా హై, ముసాఫిర్, రేస్ వంటి పలు చిత్రాల్లో నటించారు. హిందీతో పాటు అశోక్. జై చిరంజీవ వంటి పలు తెలుగు చిత్రాల్లో కూడా నటించింది. ఆమె చివరిసారిగా కన్నడ చిత్రం ‘వరధనాయక’ (2013) లో కనిపించింది. సమీరా జనవరి 21, 2014న వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. సమీరాకు 2015లో కుమారుడు (హన్స్), 2019లో కుమార్తె (నైరా) జన్మించారు.