మేకప్ లేకుండా కనిపించడమే కాకుండా, తన పొడవాటి ఉంగరాల జుట్టుతో కోట్లాది మంది అభిమానుల మనసు దోచుకుంది ‘నేచురల్ బ్యూటీ’ సాయి పల్లవి. అయితే తన ప్రాణ సమానమైన ఆ జుట్టు విషయంలో సాయి పల్లవి తీసుకున్న ఓ సాహసోపేతమైన నిర్ణయం వాళ్ల ఇంట్లోనే పెద్ద రచ్చకు దారితీసిందట. ఆ విషయం తెలిసి వాళ్ల అమ్మగారు ఎంతలా హర్ట్ అయ్యారంటే, కనీసం మాట్లాడకుండా ఏకంగా ఫోన్ పెట్టేశారట! ప్రస్తుతం సాయి పల్లవి బయటపెట్టిన ఈ సీక్రెట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.’అమరన్’ ఫేమ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘#OM’. ఈ సినిమాలో సాయి పల్లవి మునుపెన్నడూ చేయని విధంగా ఒక పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది. ఇందులో ఆమె పాత్ర పేరు ‘నిత్యా రెడ్డి’. సాధారణంగానే సాయి పల్లవి ఏ క్యారెక్టర్ చేసినా అందులో పూర్తిగా ఒదిగిపోతుంది. అయితే ఈ నిత్యా రెడ్డి పాత్ర కోసం దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఓ కొత్త లుక్‌ను డిజైన్ చేశారు. రియల్ లైఫ్ డాషింగ్ ఐపీఎస్ ఆఫీసర్ ‘మెరిన్ జోసెఫ్’ గెటప్ స్ఫూర్తితో సాయి పల్లవిని షార్ట్ హెయిర్‌తో చూపించాలని ఆయన ఫిక్స్ అయ్యారు.
పాత్ర డిమాండ్ మేరకు సాయి పల్లవి తన ఒత్తైన పొడవాటి జుట్టును కత్తిరించుకోవడానికి సిద్ధపడింది. మన ఇళ్లలో ఆడపిల్లల జుట్టు విషయంలో తల్లులు ఎంత సెంటిమెంట్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాయి పల్లవి వాళ్ల అమ్మ కూడా దీనికి మినహాయింపు కాదు. షూటింగ్ కోసం తను హెయిర్ కట్ చేయించుకున్నాననే విషయాన్ని సాయి పల్లవి ఫోన్ చేసి వాళ్ల అమ్మకు చెప్పిందట. అంతే.. ఆ మాట వినగానే ఆవిడ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కూతురు తన అందమైన జుట్టును కత్తిరించుకుందన్న కోపంతో, బాధతో వెంటనే ఫోన్ కట్ చేశారట. కొన్నాళ్ల పాటు ఆవిడ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయారని సాయి పల్లవి స్వయంగా వెల్లడించింది. గ్లామర్ ఇండస్ట్రీలో ఉంటూ, కేవలం ఒక పాత్ర సహజంగా కనిపించడం కోసం విగ్ వాడకుండా నిజంగానే జుట్టు కత్తిరించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇంట్లో వాళ్లు కోప్పడతారని తెలిసినా, సినిమాపై ఉన్న ఫ్యాషన్‌తో సాయి పల్లవి తీసుకున్న ఈ డేరింగ్ స్టెప్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

