ఒకప్పుడు టీవీలో ‘రామాయణం’, ‘శ్రీకృష్ణ’ ధారావాహికలు వస్తున్నాయంటే చాలు.. జనాలు పనులన్నీ మానుకుని టీవీల ముందు భక్తితో అతుక్కుపోయేవాళ్లు. భారతీయ టెలివిజన్ చరిత్రలో ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఘనత దివంగత దిగ్గజ దర్శకుడు డా. రామానంద్ సాగర్ ది. ఇప్పుడు ఆయన వారసులు అదే మేజిక్‌ను బుల్లితెరపై కాకుండా.. ఏకంగా వెండితెరపై అత్యంత భారీ బడ్జెట్‌తో సృష్టించేందుకు సిద్ధమయ్యారు. అది కూడా ఒక సినిమాతో కాదు.. ఏకంగా 7 భాగాల సినిమాటిక్ యూనివర్స్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవ్వడం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ‘శ్రీమద్భాగవతం’ ఇతిహాసం ఆధారంగా ఒక అద్భుతమైన లైవ్-యాక్షన్ సినిమాటిక్ సాగాకు శ్రీకారం చుట్టింది. అయితే ఇందులో అందరినీ ఉలిక్కిపడేలా చేసిన సెన్సేషనల్ పాయింట్.. ఈ సినిమాకు పనిచేస్తున్న టెక్నికల్ టీమ్. ఈ పౌరాణిక అద్భుతాన్ని కళ్లు చెదిరేలా చూపించడానికి ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్లు రంగంలోకి దిగారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్‌తో పాటు, ‘లైఫ్ ఆఫ్ పై’, ‘ది జంగిల్ బుక్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అందించిన క్లైడ్ ఎడ్వర్డ్స్ లాంటి ఉద్దండులు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. దీన్ని బట్టి చూస్తే.. తెరపై విజువల్ వండర్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.
శ్రీమద్భాగవత మహాపురాణం అనేది ఒక మహా సముద్రం లాంటిది. అందులోని అసంఖ్యాకమైన పాత్రలు, ఉపకథలు, భక్తి భావనలు ఒకే సినిమాలో చెప్పడం అసాధ్యం. అందుకే ఈ కథను ఏకంగా 7 భాగాలుగా (7 Parts) విభజించి ఒక భారీ ఫ్రాంచైజీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ఏడు భాగాల ప్రయాణంలో తొలి అధ్యాయానికి ‘శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ – విష్ణురథ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. ఈ భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు రామానంద్ సాగర్ మనవళ్లు ఆకాశ్ సాగర్ చోప్రా, అమృత్ సాగర్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. అమృత్ సాగర్ గతంలో డైరెక్ట్ చేసిన ‘1971’ సినిమాకు గానూ ఏకంగా జాతీయ అవార్డు దక్కించుకోవడం విశేషం. అత్యంత భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ముహూర్తపు షాట్, మరియు కీలకమైన షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ‘రామోజీ ఫిల్మ్ సిటీ’లోనే ప్లాన్ చేశారు. ఇక్కడే భారీ సెట్స్ నిర్మించి ఈ పురాణ కాలాన్ని కళ్లకు కట్టనున్నారు. ఇది కేవలం ఒక రెగ్యులర్ భక్తి సినిమా కాదు.. మన ప్రాచీన సంస్కృతికి, ఆధునిక హాలీవుడ్ టెక్నాలజీకి మధ్య వేస్తున్న ఒక భారీ వారధి. దేవుడి కథలను పాత పద్ధతిలో కాకుండా, నేటి తరం ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చేందుకు సాగర్ సంస్థ చేసిన ఈ మాస్టర్ ప్లాన్.. రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది!

