NTV Telugu Site icon

‘ట్రిపుల్ ఆర్’ మూవీ వరల్డ్ వైడ్ డీల్ ఎవరితో అంటే…

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ ను వరల్డ్ వైడ్ గా పంపిణీ చేసే విషయంలో ఎవరెవరి పాత్ర ఏమిటనే విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. దక్షిణాది భాషల థియేట్రికల్ రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు ఇంకా గోప్యత పాటిస్తున్నా, ఈ సినిమాను హిందీలో పంపిణీ చేస్తున్న పెన్ స్టూడియోస్, పెన్ మరుధర్ సినీ ఎంటర్ టైన్ మెంట్స్ మాత్రం ఓ స్పష్టతను ఇచ్చేశాయి.

పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో జీ 5 సంస్థ స్ట్రీమింగ్ చేస్తుందని పేర్కొంది. అలానే దీనిని హిందీలో మాత్రం నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రసారం చేస్తుందట. అలానే వరల్డ్ వైడ్ గా ఇంగ్లీష్, పోర్చిగీస్, కొరియన్, తుర్కిష్, స్పానిష్‌ భాషలలోకీ ‘ట్రిపుల్ ఆర్’ను నెట్ ఫ్లిక్స్ సంస్థ అనువదించి విడుదల చేస్తుందని స్పష్టం చేసింది. అలానే శాటిలైట్ విషయానికి వస్తే హిందీ వర్షన్ ను జీ సినిమాకు ఇచ్చిన ఈ సంస్థ, తెలుగు, తమిళ, కన్నడలో స్టార్ ఛానెల్స్ కు అప్పగించింది.

ఇక మలయాళం వర్షన్ శాటిలైట్ హక్కుల్ని ఏషియన్ నెట్ కు ఇచ్చింది. ఇక హిందీలో థియేట్రికల్ రైట్స్ ను పెన్ మరుధర్ సినీ ఎంటర్ టైన్ మెంట్స్ కు అందించినట్టు పేర్కొంది. ఒక సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే దానికి సంబంధించిన వరల్డ్ వైడ్ ప్రసార వివరాలు తెలియచేయడం ఈ మధ్య కాలంలో ‘ట్రిపుల్ ఆర్’ విషయంలోనే జరిగాయని చెప్పుకోవాలి. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళికి, నిర్మాత డీవీవీ దానయ్యకు పెన్ స్టూడియోస్ సంస్థ ధన్యవాదాలు తెలిపింది. మరి ఇదే స్ఫూర్తితో నిర్మాత డీవీవీ దానయ్య దక్షిణాది రాష్ట్రాల హక్కులను ఎవరెవరికి ఇచ్చారో అధికారికంగా తెలియచేస్తారేమో చూడాలి. మొత్తం మీద ఇటు యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు, అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంచనాలను రీచ్ అయ్యేలా ‘ట్రిపుల్ ఆర్’ను రాజమౌళి అత్యద్భుతంగా తీర్చిదిద్దే పనిలోనే ఉన్నారు.