Rich Movie : ఈ సినిమాతో మేమంతా నిజంగానే ‘రిచ్’ అయిపోతాం!

Rich Movie

Rich Movie

టాలీవుడ్‌లో ప్రతి వారం ఎన్నో సినిమాలు మొదలవుతుంటాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రమే ముహూర్తం రోజునే చిత్ర యూనిట్ చూపించే కాన్ఫిడెన్స్ తో ఇండస్ట్రీ దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటాయి. తాజాగా ఇలాంటి భారీ అంచనాలతో, ఫుల్ కాన్ఫిడెన్స్ తో పట్టాలెక్కిన చిత్రమే ‘రిచ్’ (Rich). ‘ఏ బస్తీ బాయ్ లవ్ స్టోరీ’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక (ట్యాగ్ లైన్). ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల నడుమ వైభవంగా జరిగాయి.

ఈ ప్రారంభోత్సవ వేడుకలో హీరో మోహిత్ పెడాడ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. కథ మీద ఉన్న గట్టి నమ్మకంతో ఆయన మాట్లాడుతూ.. “మా సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇక క్లైమాక్స్ చూస్తే ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. దర్శకుడు రాజా నరేంద్ర యాక్ట్ చేసి మరీ అద్భుతంగా నెరేట్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం పక్కా.. ఆ తర్వాత మేమంతా నిజంగానే ‘రిచ్’ అయిపోతాం” అంటూ ఎంతో ధీమాగా చెప్పిన మాటలు సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచేశాయి.

దర్శకుడు రాజా నరేంద్ర నేటితరం యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఒక బస్తీ కుర్రాడి అచ్చమైన ప్రేమకథగా ఈ ‘రిచ్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే కేవలం టాలీవుడ్ కే పరిమితం కాకుండా ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేయడం విశేషం. ఈ విషయాన్ని సహ నిర్మాత మహేంద్ర గైక్వాడ్ (MG గ్రూప్) అధికారికంగా ప్రకటించారు. ముందుగా తెలుగులో విడుదల చేసి, ఆ తర్వాత బాలీవుడ్ కు డబ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

బేబీ ఆరాధ్య, ఆదర్శ్ సమర్పణలో ఎంజి ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై నిర్మాతలు పద్మనాభ రెడ్డి, మార్గం గోపి ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోహిత్ పెడాడ సరసన శ్రీజిత ఘోష్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రముఖ డైరెక్టర్ దశరథ్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, నటి పూజా కేంద్రే, జబర్దస్త్ అజయ్ తదితరులు తమ కామెడీతో అలరించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ అందించే పాటలు, సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఈ బస్తీ లవ్ స్టోరీకి మేజర్ ప్లస్ కానున్నాయి. అక్టోబర్ నెలలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా ప్రారంభం కానుంది.