టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా మనీష్, పాయల్ ముఖర్జీ జంటగా నటిస్తున్న ‘రెటీనా’ సినిమా పోస్టర్, సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. అయితే ఈ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. హీరో మనీష్ లుక్స్ చూసి ఫిదా అయిన ఆయన.. “హీరో మనీష్ చాలా అందంగా ఉన్నాడు, అచ్చం విజయ్ దేవరకొండలా కనిపిస్తున్నాడు” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. పాట చూస్తుంటేనే సినిమా చూడాలనే ఆసక్తి కలుగుతోందని, మనీష్‌కు ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలని ఆయన ఆకాంక్షించారు. పార్వతి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత పార్వతి ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అల్లం రాజు రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు అల్లం రాజు సినిమా వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. “నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో, బలమైన భావోద్వేగాలతో ఈ కథను రూపొందించాం. స్క్రిప్ట్ విన్న వెంటనే ఇలాంటి కథ తాను ఎప్పుడూ వినలేదని చెబుతూ, మా నిర్మాత పార్వతి గారు సినిమా చేయడానికి ముందుకొచ్చారు. ప్రేక్షకులకు ఇదొక సరికొత్త అనుభూతిని ఇస్తుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నిర్మాత పార్వతి మాట్లాడుతూ.. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ప్రేక్షకులు తమ ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. హీరో మనీష్ మాట్లాడుతూ.. “పాట మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సాంగ్ లాగే సినిమా కూడా తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఒక మంచి కథ చెప్పాలని మా డైరెక్టర్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు, ఈ సినిమాతో ఆయనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వస్తుంది. నిర్మాత మమ్మల్ని సొంత వాళ్లలా చూసుకున్నారు, టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా కష్టపడ్డాం” అని తెలిపారు. ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్న హీరోయిన్ పాయల్ ముఖర్జీ మాట్లాడుతూ.. కథ విన్న వెంటనే ఈ సినిమాలో కచ్చితంగా నటించాలని నిర్ణయించుకున్నానని, తెలుగు పరిశ్రమకు కొత్త అయినప్పటికీ టీమ్ అంతా తనకు ఎంతో సపోర్ట్ చేసిందని కృతజ్ఞతలు తెలిపింది.

