Renu Desai: ఆడవాళ్లేమీ రోబోలు కాదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!

Renu Desai Women Are Not Robots

Renu Desai Women Are Not Robots

Renu Desai: సోషల్ మీడియా ట్రోల్స్‌కు, కామెంట్స్‌కు అస్సలు తగ్గేదేలే అంటోంది సినీనటి రేణు దేశాయ్. తన మనసులో ఏది అనిపిస్తే అది ముక్కుసూటిగా మాట్లాడే ఆమె.. తాజాగా మరోసారి మగవారి ఆలోచనా విధానంపై, సమాజంలో మహిళలకు ఎదురవుతున్న వివక్షపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన శ్రీమతి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వేదికపైనే ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మహిళల గుర్తింపు గురించి రేణు దేశాయ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఆడవాళ్లకు పుట్టుకతోనే సొంత ఐడెంటిటీ లేకుండా పోతోంది. చిన్నప్పుడు ఫలానా వారి కూతురు అంటారు.. పెళ్లయ్యాక ఫలానా వారి భార్య అంటారు. ముఖ్యంగా ఒక ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాక ఆడపిల్ల తన సొంత అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతోంది. నేను ఈ మాటలు మాట్లాడితే సోషల్ మీడియాలో నన్ను దారుణంగా ట్రోల్ చేస్తారని నాకు తెలుసు.. కానీ నేను ఎవరికీ భయపడను, ఎవరినీ లెక్క చేయను అంటూ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఇంట్లో మహిళల పట్ల మగవారు ప్రవర్తించే తీరుపై రేణు దేశాయ్ మండిపడ్డారు. మగవారు గుడికి వెళ్లి లక్ష్మీదేవికి, అమ్మవారికి ఎంతో భక్తితో పూజలు చేస్తారు. కానీ ఇంట్లో ఉన్న లక్ష్మీ స్వరూపమైన ఆడవాళ్లకు మాత్రం కనీస గౌరవం కూడా ఇవ్వరు. అసలు ఆడవాళ్లేమీ ఇంట్లో అన్ని పనులు చేయడానికి రోబోలు కాదు.. మగవాళ్లకు ఉన్నట్లే మాకూ కిడ్నీలు, ఇతర బాడీ ఆర్గాన్స్ ఉంటాయి. ఏ మగవాడూ సొంత కడుపులో పుట్టలేదు, పుట్టలేడు కూడా.. ఒక ఆడదే వారికి జన్మ ఇవ్వాలి అనే నిజాన్ని మర్చిపోకూడదు అంటూ చురకలంటించారు.

ఈ సందర్భంగా యంగ్ హీరో తిరువీర్‌తో పాటుగా స్టార్ యాంకర్ సుమ గురించి రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తిరువీర్ నాకు సొంత తమ్ముడిలాంటి వాడు. అతని భార్య కల్పన నాకు బాగా తెలుసు. ఈ సినిమాలో తిరువీర్ పాత్రకు, నిజ జీవితంలో అతని క్యారెక్టర్‌కు అసలు సంబంధమే లేదు. రియల్ లైఫ్‌తో తిరువీర్ తన భార్యకు ఎంతో సపోర్ట్ చేస్తాడు. భర్త అంటే తిరువీర్‌లా ఉండాలి. ఇక స్టేజ్‌పై ఉన్న సుమ గారూ.. మీ భర్త రాజీవ్ కనకాల గారు కనుక మీకు సపోర్ట్ చేయకపోయి ఉంటే, ఈపాటికి మీరు ఇలా స్టేజ్ మీద ఉండేవారు కాదు.. ఇంట్లో కూర్చుని వంట చేసుకుంటూ ఉండేవారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చివరగా మగవారికి ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తూ.. ఎవరైతే తమ భార్యలకు అండగా నిలుస్తున్నారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ ఎవరైతే సపోర్ట్ చేయడం లేదో, వారు ఇప్పటికైనా కళ్లు తెరవండి. మీ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ల టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించండి.. అంతేకానీ వారిని అణచివేసి తొక్కేయకండి అని రేణు దేశాయ్ రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం రేణు దేశాయ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..