సీనియర్ నటి రేణు దేశాయ్ మరోసారి తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాను విడాకులు తీసుకుని 14 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఇవ్వకుండా, పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరాముడు కూడా వనవాసం 14 ఏళ్లే చేశాడని, మరి తన వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? అని ప్రశ్నించారు. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ స్పందించారు.
తెలుగు ప్రేక్షకులకు తన గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని రేణు దేశాయ్ అన్నారు. బద్రి సినిమాతోనే తన జీవితం మొదలైందని చాలామంది భావిస్తున్నారని, అంతకుముందు తనకంటూ ఒక జీవితం ఉన్న విషయాన్ని మర్చిపోతున్నారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌తో విడాకులు జరిగి 14 ఏళ్లు పూర్తయ్యాయని గుర్తుచేసుకుంటూ.. ఆ శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం చేశారని, తన వనవాసం ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదని రేణు దేశాయ్ భావోద్వేగానికి గురయ్యారు.
2012లో విడాకులు మంజూరైన తర్వాత కూడా తాను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సక్సెస్ అందుకున్నానని రేణు దేశాయ్ వివరించారు. ఒక మరాఠీ సినిమాను నిర్మించానని, అది మంచి విజయాన్ని అందుకుందని తెలిపారు. మరో సినిమాకు కథ రాయడంతో పాటు నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టానని చెప్పారు. డ్యాన్స్ షోలకు పనిచేశానని, కవితలు రాశానని, ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తున్నానని వెల్లడించారు. ఇన్ని రంగాల్లో పనిచేస్తున్న తనకు ప్రత్యేక గుర్తింపు లేదని ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శల గురించి కూడా రేణు దేశాయ్ స్పందించారు. ఒక కుక్కను కాపాడినా తనను విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ లేకపోతే తనకు జీవించే అర్హతే లేనట్టుగా కొందరు మాట్లాడుతున్నారని అన్నారు. తన వ్యక్తిత్వం, పనులు, జీవితాన్ని పక్కనపెట్టి కేవలం పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే గుర్తించడం బాధ కలిగిస్తోందని రేణు దేశాయ్ అన్నారు. రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

