Site icon NTV Telugu

Hemalatha Lavanam: గ్రేట్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్‌ మాజీ భార్య!

Renu Desai

Renu Desai

హేమలతా లవణం! ప్రముఖ దళిత రచయిత గుర్రం జాషువా కుమార్తె! అంతేకాదు… నాస్తికోద్యమ నిర్మాత గోరా కోడలు!! గోరా తనయుడు లవణంను వివాహం చేసుకున్న సామాజిక సంస్కర్త. మరీ ముఖ్యంగా స్టువర్ట్ పురం దొంగలలో పరివర్తన తీసుకురావడానికి విశేషమైన కృషి చేసిన నారీమణి. ఆ పాత్రను వెండితెరపై పోషించే గొప్ప అవకాశం పవన్ కళ్యాణ్‌ మాజీ భార్య, నటి, దర్శక నిర్మాత రేణు దేశాయ్ కు లభించింది. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పిస్తున్నారు.

 

1970 స్టువర్ట్‌పురం నేపధ్యంలో పేరు మోసిన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఇది రూపొందుతోంది. ఇందులో రేణు దేశాయ్ హేమలతా లవణం పాత్రను పోషిస్తోంది. ఆమె పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఈ రోజు ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ వీడియోలో రేణు దేశాయ్ తెల్లచీరలో కనిపించే మరో ఇద్దరు మహిళా కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నడుస్తూ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. జి.వి. ప్రకాష్ కుమార్ బిజిఎమ్ పాత్రను మరింత ఎలివేట్ చేసింది. నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ సైతం కీలక పాత్ర పోషించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

Exit mobile version