తెలుగు సినిమా స్వర్ణ యుగాన్ని పరిపుష్ఠి చేసిన మహా నటులలో అగ్రగణ్యులు ఎస్వీ రంగారావు. ఆయన తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల మదిలో చెప్పరాని ఆసక్తి తొణికిసలాడేది… ఎందుకంటే తెర నిండుగా ఉండే ఆ విగ్రహం… నటనలో నిగ్రహం… పాత్రకు తగిన ఆగ్రహం… అనువైన చోట ప్రదర్శించే అనుగ్రహం– అన్నీ రంగారావు నటనలో మెండుగా కనిపించేవి… అందుకే ఆయన వెండితెరపై కనిపించారంటే జనానికి ఆనందం.
యస్.వి. రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 1918 జూలై 3న సామర్ల కోటేశ్వరరావు, లక్ష్మీ నరసాయమ్మ లకు కృష్ణాజిల్లాలోని నూజివీడులో జన్మించారు. తండ్రి ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేసేవారు. తాత కోటయ్య నాయుడు నూజివీడులో పేరున్న వైద్యులు. ఆయన చెన్నై దగ్గరలోని చెంగల్పట్టులో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గా పనిచేయడంతో రంగారావు కూడా నాయనమ్మ దగ్గరే చెన్నయ్ లో ఉన్నారు. ఆయన చదువు ట్రిప్రిక్లేన్ లోని హిందూ హైస్కూల్ లో సాగింది. ఆ తర్వాత నాయనమ్మతో పాటు ఆయన కూడా ఏలూరు చేరారు. విశాఖపట్నంలోని మిసెస్ ఎ.వి.యన్. కళాశాలలో ఇంటర్, కాకినాడ పి.ఆర్. కాలేజీలో బి.ఎస్.సి. చేశారు. పదిహేనేళ్ళ ప్రాయంలోనే రంగస్థలంపై తన ప్రతిభను చాటుకున్నారు. దానికి తోడు బళ్ళారి రాఘవాచార్యులు, గోవిందరాజులు సుబ్బారావు వంటి మహానటుల నటనతో ప్రభావితుడయ్యారు.
1947లో ‘వరూధిని’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయినా… అది పరాజయంపాలు కావడంతో తిరిగి ఉద్యోగ జీవితంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 1950లో వచ్చిన ‘షావుకారు’లోని ‘సున్నం రంగడు’ పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విజయా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘పాతాళ భైరవి’ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఇక ఆయన వెనుదిరిగి చూసుకునే ఆస్కారం కలగలేదు. అక్కడ నుండి అప్రతిహతంగా సాగిన ఎస్వీయార్ విజయ ప్రస్థానం అందరికీ తెలిసిందే!
చిత్రానికి కథానాయకుడుగా ఉండి జనం మదిని గెలవడం పరిపాటే. అయితే ప్రతినాయకునిగానూ, గుణచిత్ర నటునిగానూ ఉంటూ తనదైన బాణీ పలికించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రంగారావు. అది తరిగిపోదు చెరిగిపోదు. ఆ స్థాయిలో తెలుగునాట అలరించిన మరో కేరెక్టర్ యాక్టర్ మనకు కనబడరు. భయపెట్టడమే కాదు, కరుణరసం కురిపించి ఆకట్టుకోవడంలోనూ మేటి రంగారావు. ఆయన పోషించిన కరుణ రస పాత్రలు అనేకం జనాన్ని మురిపించాయి… మైమరిపించాయి… కన్నీరు కార్పించాయి. ఎస్వీ రంగారావు ఆకారానికి తగ్గ పాత్రలే ఆయనను పలకరించాయి… అవే జనాన్ని పులకరింప చేశాయి… ఆ విగ్రహానికి తగిన పాత్రల్లో రంగారావు నటన సాగిన తీరును ఇప్పుడు చూసినా ఒళ్ళు జలదరించవలసిందే… అదీ ఆయన నటనలోని విశేషం.
పౌరాణికమైనా, జానపదమైనా, చారిత్రకమైనా, సాంఘికమైనా- ఏదైనా సరే ఎస్వీ రంగారావు తనకు లభించిన పాత్రలను అవలీలగా ఆకళింపు చేసుకొనేవారు… పాత్రకు తగ్గ అభినయం ప్రదర్శించి, ఆకట్టుకొనేవారు… జనం మదిని పట్టుకొనేవారు… యస్వీ రంగారావు అనగానే ఆయన ధరించిన అనేక పాత్రలు మన మదిలో మెదలుతాయి… అయితే వాటిలో అతి ప్రధానమైనది ‘నర్తనశాల’లోని కీచక పాత్ర… ఈ పాత్రతోనే జకార్తాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమనటునిగా రంగారావు జేజేలు అందుకున్నారు… తెలుగు సినిమా జానపదాలకు ఓ కొత్త ఒరవడిని తీసుకు వచ్చిన చిత్రం నిస్సందేహంగా కేవీ రెడ్డి తెరకెక్కించిన ‘పాతాళభైరవి’… ఈ చిత్రంలో రష్యన్ మూకీ మూవీ ‘ఇవాన్ ద టెర్రిబుల్’ను పోలిన గెటప్ తో ఎస్వీ రంగారావు ఆకట్టుకున్న తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు… ఇక ‘భట్టి విక్రమార్క’, ‘బాలనాగమ్మ’, ‘విక్రమార్క విజయం’ వంటి చిత్రాలలో ఆయన పోషించిన మాయలమరాఠీ పాత్రలను ఎవరు మాత్రం ధరించి మెప్పించగలరు!?
ఎస్వీయార్ కనిపించిన చారిత్రక చిత్రాలు తక్కువే అయినా, వాటిలో ఆయన అభినయం పొందిన మార్కులు చాలా ఎక్కువ… అక్బర్ గా, తాండ్ర పాపారాయునిగా, భోజరాజుగా ఇలా రాజసం ఒలికించే పాత్రల్లో రంగారావు కనబరచిన నటన తెలుగువారిని ఎంతగానో ఆకట్టుకుంది…
సాంఘికాలలోనూ ఎస్వీఆర్ అభినయం సాగిన తీరు అనితరసాధ్యం అనే చెప్పాలి… రంగారావు నటన చూసి, ఎందరో గుణ చిత్ర నటులు ఆ దిశగా పయనం మొదలు పెట్టారు… కానీ, ఎవరూ రంగారావులాగా పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోయారు… ఆయన ధరించిన అనేక సాంఘిక చిత్రాల్లోని పాత్రలు మనలను కట్టిపడేస్తాయి.
ఆ రోజుల్లో నటీనటులందరూ ఓ కుటుంబంలా ఉండేవారని చెబుతారు… ఎందరో మేటి నటధీరులతో నటించిన యస్వీ రంగారావు, తరగిపోని యశస్సును సొంతం చేసుకొని యశస్వీ రంగారావుగానూ జేజేలు అందుకున్నారు… అదీ ఎస్వీఆర్ నటనావైభవంలోని గొప్పతనం… వ్యక్తిగానూ అదే తీరున సాగిన రంగారావు, నాటి వర్ధమాన నటీనటులకు పెద్ద దిక్కుగానూ నిలచి వారిని విజయపథంలో పయనింప చేసిన వైనాలను తలచుకొనే కొద్దీ మనసులు పులకించి పోవలసిందే… కొందరు నటచక్రవర్తులు తెలుగువారికి లభించిన వరాలు… అలాంటి వారిలో నిస్సందేహంగా ఎస్వీ రంగారావు స్థానం ప్రత్యేకమైనది… ఆయన అభినయ కౌశలాన్ని ఎంత తలచినా కొంతే అవుతుంది… రంగారావు నటనను చూసి భావితరాలు సైతం పులకించిపోతాయని చెప్పవచ్చు. యస్వీ రంగారావులోనూ మంచి రచయిత ఉన్నారు. 1960 -64 మధ్య కాలంలో కొన్ని కథలు రాశారు. అవి యువ, ఆంధ్రపత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీటిని ‘ఎస్.వి. రంగారావు కథలు’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. అలానే ఆయనలో ఓ చక్కని దర్శకుడూ ఉన్నారు. 1967లో ‘చదరంగం’, 1968లో ‘బాంధవ్యాలు’ చిత్రాలను డైరెక్ట్ చేశారు ఎస్వీఆర్. ఈ రెండు సినిమాలకూ నంది అవార్డులు రావడం విశేషం. తెలుగులోనే కాకుండా ఎస్వీయార్ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లోనూ నటించి మెప్పించారు.
1974 ఫిబ్రవరిలో హైదరాబాద్ కు షూటింగ్ కు వచ్చిన ఎస్వీఆర్ కు మొదటి సారి గుండెపోటు వచ్చింది. వెంటనే ఉస్మానియా హాస్టిటల్ కు తరలించి వైద్యం చేయించారు. ఆ తర్వాత చెన్నయ్ వెళ్ళిన కొన్ని నెలలకు జూలై 18న మధ్యాహ్నం వచ్చిన గుండెపోటు నుండి ఆయన కోలుకోలేకపోయారు.
ఆ గుణచిత్ర నటుడిని స్మరించుకుంటూ ఆంధ్రదేశంలోని పలు ప్రాంతాలలో ఆయన విగ్రహలను అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రతిష్ఠింపచేశారు. అలా ధవళేశ్వరం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు పట్టణాలలో ఎస్వీయార్ విగ్రహాలు నాలుగు రోడ్ల కూడళ్ళలో నిలిచి ఆయన్ని ప్రజలు సదా స్మరించుకునేలా చేస్తున్నాయి.
(నేడు ఎస్వీ రంగారావు 103వ జయంతి సందర్భంగా)