RC17 Heroine: ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘RC17’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెగ్యులర్ షూటింగ్ 2027 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చరణ్, సుక్కు మరోసారి కలిసి పనిచేయనుండటంతో.. ఈ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. రంగస్థలంలో గ్రామీణ రాజకీయాలు, పుష్పలో ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రపంచాన్ని చూపించిన సుక్కు.. ఈసారి ఎలాంటి కొత్త ప్రపంచాన్ని చూపిస్తారో అని ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. తాజాగా RC17కు సంబంధించిన ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
RC17లో కథానాయిక పాత్ర కోసం ఐదుగురు నటీమణులకు లుక్ టెస్టులు నిర్వహించడంతో పాటు ఆడిషన్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో యువ హీరోయిన్స్ శ్రీలీల, సారా అర్జున్, భాగ్యశ్రీ బోర్సే, ప్రీతి ముకుందన్, సాత్విక వీరవల్లి పేర్లు ఉన్నాయి. అయితే వీరిలో ఎవరినీ ఇప్పటివరకు అధికారికంగా ఎంపిక చేయలేదట. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ ఎంపిక విషయంలో ప్రస్తుతం ట్రెండ్, క్రేజ్, మార్కెట్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ సుకుమార్ మాత్రం RC17 కోసం తొందరపడకుండా.. పాత్రకు సరిపోయే నటిని ఎంపిక చేసేందుకు సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే పలువురు నటీమణులకు ఆడిషన్స్, లుక్ టెస్టులు నిర్వహిస్తున్నారట.
RC17 కోసం ఈ ఐదుగురిలో ఒకరిని హీరోయిన్గా ఖరారు చేస్తారా? లేదా చివరి నిమిషంలో ఎవరూ ఊహించని మరో నటిని ఎంపిక చేసి సుకుమార్ ట్విస్ట్ ఇస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వస్తే గానీ.. RC17 హీరోయిన్ ఎవరనే ఉత్కంఠకు తెరపడుతుంది. రామ్ చరణ్ సరసన ‘ధురంధర్’ బ్యూటీ సారా అర్జున్ అయితే బాగుంటుందని ఫాన్స్ అంటున్నారు. మరి సుకుమార్ మనసులో ఎవరున్నారో? చూడాలి. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల ఎంపికను ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్.

