Site icon NTV Telugu

మాస్ మహరాజా కెరీర్ లో సెకండ్ ఫేజ్ షురూ!

మాస్ మహరాజా రవితేజ కెరీర్ లో సెకండ్ ఫేజ్ జూలై 1న మొదలైంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం చిత్రసీమలోకి అడుగుపెట్టి అంచలంచెలుగా ఈ స్థాయికి ఎదిగాడు రవితేజ. కెరీర్ ప్రారంభంలో దర్శకత్వ శాఖలోనూ పనిచేసిన రవితేజ, చిన్న చిన్న పాత్రలు కొన్ని చేసి ‘సిందూరం’ మూవీతో హీరో అయ్యాడు. ఆ తర్వాత రెండేళ్ళకు ‘నీ కోసం’తో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దానికి ముందు నటుడిగా స్థిరపడటం కోసం రవితేజ గట్టి పోరాటమే చేశాడు. అయితే సహాయ దర్శకుడిగా అతనికి ఉన్న పరిచయాలు నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి కొంత మేర దోహదం చేశాయి. ‘ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం’తో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్స్ రవితేజా ఖాతాలో పడ్డాయి.

read also : సినిమాలు తగ్గినా… సెగ తగ్గని హాట్ సీనియర్ బ్యూటీ!

కెరీర్ ప్రారంభంలో దర్శకత్వ శాఖలో పనిచేసిన రవితేజ… హీరోగా ఎన్ని సూపర్ హిట్స్ అందుకున్నా… మెగా ఫోన్ మాత్రం పట్టుకునే ప్రయత్నం చేయలేదు. నటుడిగానే ఉండిపోయాడు. అలానే చెన్నయ్ లోని తన రూమ్మేట్స్, ఇప్పటి పాపులర్ డైరెక్టర్స్ గుణశేఖర్, వైవియస్ చౌదరి… నిర్మాతలుగా మారినా రవితేజ చిత్ర నిర్మాణం వైపు కూడా అడుగుపెట్టలేదు. తనతోటి హీరోలు చాలామంది నిర్మాతలు అయినా ఆ ఛాయలకు కూడా రవితేజ పోలేదు. చూస్తుండగానే సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు రవితేజ తన 68వ సినిమాలో నటిస్తున్నాడు. ఉన్నట్టుండి ఇప్పుడీ మాస్ మహరాజా మనసు మార్చుకున్నాడు. చిత్ర నిర్మాణానికీ సై అన్నాడు.

కొన్ని నెలలుగా రవితేజ నిర్మాతగా మారబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎవరితో సినిమా తీస్తాడు? ఏ దర్శకుడితో సినిమా నిర్మిస్తాడు? అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. జూలై 1 గురువారం శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైన సందర్భంలో సుధాకర్ చెరుకూరితో పాటు ఈ సినిమా నిర్మాణంలో రవితేజ సైతం భాగస్వామి కాబోతున్నాడనేది తెలిసింది. ఆర్. టి. టీమ్ వర్క్స్ పేరుతో రవితేజ సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.

ఒకసారి రంగంలోకి దిగిన తర్వాత ఇక నిర్మాతగానూ విజృంభిస్తాడనే అందరూ అంటున్నారు. ఇది డిజిటల్ యుగం కాబట్టి ఓటీటీ చిత్రాలను, వెబ్ సీరిస్ లను రవితేజ నిర్మించే ఆస్కారం లేకపోలేదు. అదే సమయంలో రవితేజ తనయుడు మహాధన్ సైతం ఆ మధ్య ‘రాజా ది గ్రేట్’లో సూపర్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. అతను రాబోయే రోజుల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చినా… రవితేజకు సొంత బ్యానర్ ఉండటం అనేది ఉపయోగపడుతుంది. సో… రవితేజ చాలా ముందు చూపుతోనే ఆర్. టి. టీమ్ వర్క్స్ ను ప్రారంభించాడని సన్నిహితులు చెబుతున్నారు.

Exit mobile version