Ranveer Singh and Aditya Dhar to Reunite: ‘ధురంధర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం ‘ప్రళయ్’ చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రం తన తదుపరి సినిమా విషయంలో ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఆయన కొత్త ప్రాజెక్ట్‌పై కొంతకాలంగా రకరకాల వార్తలు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో విక్కీ కౌశల్‌తో ప్రకటించిన ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ కథను అల్లు అర్జున్‌కు వినిపించాడని ప్రచారం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకపోవడంతో ఎన్టీఆర్, ప్రభాస్‌లకు కూడా కొత్త కథలు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. చివరకు విక్కీ కౌశల్‌తోనే అశ్వత్థామ సినిమాను తెరకెక్కించనున్నాడంటూ మరోసారి గాసిప్స్ వినిపించాయి. అయితే వీటిలో ఏ ఒక్క అంశంపైనా ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు.
ఇదిలా ఉంటే ఆదిత్య ధర్ తన తదుపరి సినిమాను టాలీవుడ్ హీరోతో చేయనున్నాడని గతంలో ప్రచారం జరిగింది. కానీ తాజాగా రణ్‌వీర్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. ధురంధర్ కాంబినేషన్ మరోసారి చేతులు కలపబోతోందని బాలీవుడ్ వర్గాల్లో బజ్ వినిపిస్తోంది. అశ్వత్థామ, ఆర్య వర్త్ కథలను పక్కన పెట్టి.. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్న చంద్రగుప్త మౌర్య జీవిత కథను వెండితెరపైకి తీసుకురావాలని ఆదిత్య ధర్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారట. 2027లో చిత్రీకరణ ప్రారంభించి.. 2028 చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడని టాక్.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ధురంధర్ అనూహ్య విజయాన్ని అందుకుని రూ.1,300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ధురంధర్: ది రివెంజ్ కూడా బాక్సాఫీస్ వద్ద రూ.1,800 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించి.. భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండో స్థానానికి చేరింది. ఈ నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ మరోసారి కలిసి పనిచేస్తే.. ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే చంద్రగుప్త మౌర్య బయోపిక్ కోసం వీరిద్దరూ నిజంగానే చేతులు కలుపుతున్నారా? లేక ఇది కూడా మరో ప్రచారానికే పరిమితం అవుతుందా? అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

