Ramya Krishnan: సినీ ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’ అనే మాట ఎప్పటికప్పుడు ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంటుంది. దీనిపై కొందరు నటీమణులు బహిరంగంగా స్పందిస్తే, మరికొందరు అసలు అలాంటిదేమీ లేదని దాటవేస్తుంటారు. కానీ దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీని దగ్గరగా చూసిన సీనియర్ నటి రమ్యకృష్ణ మాత్రం ఈ విషయంపై ఎలాంటి మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
క్యాస్టింగ్ కౌచ్ గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు రమ్యకృష్ణ చాలా బోల్డ్‌గా సమాధానమిచ్చారు. “క్యాస్టింగ్ కౌచ్ అనేది గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతోంది, భవిష్యత్తులో కూడా జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఎవరూ కాదనలేరు, అసలు లేదని అబద్ధం చెప్పలేరు” అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కాలాన్ని బట్టి అది జరిగే తీరు మారుతుందని, బలవంతంగానా, మన ఇష్టంతోనా లేక క్యాజువల్గానా అనేదే మారుతుంటుందని ఆమె అసలు నిజాన్ని బయటపెట్టారు.
సినీ పరిశ్రమపైనే ఎప్పుడూ ఎందుకు వేలెత్తి చూపుతారో కూడా రమ్యకృష్ణ సూటిగా ప్రశ్నించారు. “మాది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి దీని గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. కానీ బయట ఇతర రంగాల్లో ఎంతమంది ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారో చూడండి. నిజానికి దీన్ని ‘క్యాస్టింగ్ కౌచ్’ అని పిలవడమే తప్పు. ఈ దోపిడీ కేవలం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాలేదు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ, అన్ని డిపార్ట్మెంట్లలోనూ ఇది జరుగుతోంది. అంతేకాదు, ఇందులో ఎలాంటి జెండర్ వేరియేషన్ (ఆడ, మగ తేడా) కూడా లేదు. అందరూ దీన్ని ఎదుర్కొంటున్నారు” అంటూ రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాలుగు దశాబ్దాల కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రమ్యకృష్ణ.. ఇండస్ట్రీలోని చీకటి కోణంపై ఇంత నిజాయితీగా, ధైర్యంగా మాట్లాడటంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

