Ramayana Tickets Price Cut: కొన్నిరోజులుగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్లిన ‘రామాయణ’ చిత్రంకు ప్రస్తుతం వసూళ్ల వేగం క్రమంగా తగ్గుతోంది. తొలి వారంలో వరుసగా భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం.. ఒక రోజు రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. అయితే సోమవారం నాటికి వసూళ్లు గణనీయంగా తగ్గి.. కేవలం రూ. 12 కోట్లకు పడిపోయాయి. దీంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు చిత్ర నిర్మాతలు టికెట్ ధరలను భారీగా తగ్గించారు.
దేశవ్యాప్తంగా రూ.99కే టికెట్లు:
నేడు గురునానక్ జయంతి (గురుపురబ్) సందర్భంగా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావాలనే ఉద్దేశంతో రామాయణ చిత్ర బృందం టికెట్ ధరల తగ్గింపును ప్రకటించింది. సినిమా అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టర్ విడుదల చేస్తూ.. మంగళవారం రూ.99 నుంచే టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ‘ఈ మంగళవారం బిగ్ స్క్రీన్‌పై రామాయణాన్ని కేవలం రూ.99కే ఆస్వాదించండి’ అంటూ పేర్కొంది. ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో గతంలో 2డీ షోలకు రూ.300 నుంచి రూ.400 వరకు ఉన్న టికెట్లు.. ఇప్పుడు రూ.99కే అందుబాటులోకి వచ్చాయి. చాలా ప్రాంతాల్లో 50 నుంచి 60 శాతం వరకు ధరలు తగ్గగా.. కొన్ని థియేటర్లలో ఏకంగా 80 శాతం వరకు తగ్గాయి.
3డీ, ఐమాక్స్ టికెట్ల ధరలూ తగ్గింపు:
ప్రీమియం సీట్లు, రిక్లైనర్ సీట్లకు మాత్రం కొంత ఎక్కువ ధర కొనసాగుతోంది. రిక్లైనర్ టికెట్లు సుమారు రూ.199 నుంచి రూ.249 వరకు అందుబాటులో ఉన్నాయి. 3డీ, ఐమాక్స్ షోలకు కూడా సాధారణ టికెట్ల కంటే ఎక్కువ ధర ఉన్నప్పటికీ.. గత ధరలతో పోలిస్తే భారీ తగ్గింపులు ప్రకటించారు. ముంబై, ఢిల్లీలో 3డీ టికెట్లు రూ.119 నుంచి రూ.249 మధ్య అందుబాటులో ఉన్నాయి. గతంలో రూ.500కు పైగా ఉన్న ధరలు గణనీయంగా తగ్గాయి. కొన్ని థియేటర్లలో ఐమాక్స్ 3డీ టికెట్లు సైతం రూ.250కే అందుబాటులోకి వచ్చాయి. అయితే అన్ని థియేటర్లలో ధరలు ఒకేలా తగ్గలేదు. కొన్ని చోట్ల ఇప్పటికీ రూ.700 నుంచి రూ.800 వరకు ప్రీమియం టికెట్ ధరలు కొనసాగుతున్నాయి.
వసూళ్లు పెరిగేనా?:
నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ: పార్ట్ 1’ దీపావళి సందర్భంగా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాగా, యశ్ రావణుడిగా నటించారు. మొదటి రోజు నుంచే ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. రామాయణ 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1,704.65 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది. ఇందులో భారతదేశంలో రూ.1,141.65 కోట్ల గ్రాస్ వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నారు. రామాయణకు ప్రస్తుతం కలెక్షన్లు తగ్గాయి. ఈ నేపథ్యంలో టికెట్ ధరల తగ్గింపు ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించి వసూళ్లను పెంచుతుందా? అన్నది చూడాలి.

