Journey of Ramayana: నితీశ్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సరికొత్త ‘రామాయణ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టి ప్రేక్షకులను విస్మయానికి గురిచేస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్, భారీ కాన్వాస్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాను చూసి జనాలు అబ్బురపడుతున్నారు. అయితే భారతీయ సినీ చరిత్రలో ఈ రామాయణ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? అసలు మొట్టమొదటి సినిమాలో రాముడు, సీతగా ఎవరు నటించారు? అనే చరిత్రను తవ్వితే మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు వెలుగుచూస్తున్నాయి.
స్త్రీ పాత్రలపై నిషేధం.. ఒకే నటుడు రాముడు, సీతగా డబుల్ రోల్!
భారతీయ చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 1917లోనే రామాయణ ఘట్టంతో ‘లంకా దహన్’ అనే మూకీ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆ రోజుల్లో మహిళలు నాటకాల్లో గానీ, సినిమాల్లో గానీ నటించడం తీవ్రమైన నిషిద్ధంగా భావించేవారు. దీంతో దర్శకుడు ఎవరూ ఊహించని ఒక ప్రయోగం చేశారు. అన్నా సాలుంకే అనే నటుడితోనే అటు శ్రీరాముడి పాత్రను, ఇటు సీతాదేవి పాత్రను రెండింటినీ వేయించారు. అలా భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారిగా ఒకే నటుడు అటు రాముడిగా, ఇటు సీతగా డబుల్ రోల్ చేసి సరికొత్త రికార్డు సృష్టించడం విశేషం.
వందకు పైగా సినిమాలు.. దేవుళ్లుగా మారిన తారలు
ఆ తర్వాత 1934లో సి.పుల్లయ్య తెరకెక్కించిన ‘లవకుశ’తో టాకీ సినిమాల శకం మొదలైంది. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా రామాయణంలోని రకరకాల ఘట్టాల ఆధారంగా దాదాపు వందకు పైగా సినిమాలు వెండితెరపైకి వచ్చాయి. తెలుగు చిత్రసీమలో నందమూరి తారక రామారావు ‘లవకుశ’, ‘సీతారామ కళ్యాణం’ సినిమాల్లో రాముడిగా కనిపించి, ఏకంగా ప్రతి తెలుగింటి పూజా గదిలోనూ కొలువైపోయారు. ఆ తర్వాత శోభన్ బాబు ‘సంపూర్ణ రామాయణం’, జూనియర్ ఎన్టీఆర్ ‘బాల రామాయణం’, బాలకృష్ణ ‘శ్రీ రామరాజ్యం’ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
దేశవ్యాప్తంగా వచ్చిన ప్రయోగాలు:
హిందీలో 1943 నాటి ‘రామ్ రాజ్య’, 1992లో వచ్చిన జపనీస్ యానిమేషన్ సినిమా, రీసెంట్గా ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ వరకు ఎన్నో విభిన్న ప్రయత్నాలు జరిగాయి. ఇక 1987లో దూరదర్శన్‌లో రామానంద్ సాగర్ రూపొందించిన ‘రామాయణ్’ సీరియల్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆదివారం ఉదయం ఈ సీరియల్ వచ్చే టైమ్‌లో పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా రోడ్లన్నీ కర్ఫ్యూ పెట్టినట్టు నిర్మానుష్యంగా మారిపోయేవి.
అప్పట్లో అద్దాలు, చిన్న చిన్న కెమెరా ట్రిక్కులతోనే ఇంద్రజిత్తు మాయలు, హనుమంతుడి ఆకాశ విహారాలను చూపించేవారు. కానీ నేడు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘DNEG’ లాంటి అంతర్జాతీయ సంస్థల విజువల్ ఎఫెక్ట్స్‌తో రామాయణాన్ని అద్భుతంగా తెరపైకి తెస్తున్నారు. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోవడం లేదు. రామ-రావణ యుద్ధం, లంకా దహనం లాంటి భారీ ఘట్టాలతో ‘రామాయణ: పార్ట్ 2’ను 2028 దీపావళికి థియేటర్లలోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు రామాయణ మేకర్స్. మరోవైపు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రాబోతున్న ‘జై హనుమాన్’ లాంటి సినిమాలతో రామాయణ కథల ప్రభంజనం మున్ముందు కూడా కొనసాగనుందని స్పష్టంగా అర్థమవుతోంది.

