Ramayana Record: ‘రామాయణ’ రికార్డుల జాతర.. ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’ను దాటేసి టాప్‌లోకి!

Ramayana Bookmyshow Record

Ramayana Bookmyshow Record

Ramayana Creates BookMyShow Record: బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణ: పార్ట్ 1’ మరో అరుదైన ఘనత సాధించింది. బుక్‌మైషోలో అత్యధిక పీక్ అవర్ ట్రెండింగ్ ఆసక్తిని నమోదు చేసిన సినిమాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇప్పటికే సంచలనం సృష్టించిన ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి చిత్రాలను వెనక్కి నెట్టి.. రామాయణ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. బుక్‌మైషో గణాంకాల ప్రకారం.. రామాయణ 1,11,830 ట్రెండింగ్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. 2026 దీపావళి ఆదివారం కావడంతో.. సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది.

1,09,170తో ‘ధురంధర్ 2’ రెండో స్థానంలో ఉండగా.. 1,07,650తో ‘పుష్ప 2’ మూడో స్థానాన్ని దక్కించుకుంది. 96,140తో ‘ఎంపురాన్’ నాలుగో స్థానంలో ఉండగా.. 95,710తో ‘కల్కి 2898 ఏడీ’ ఐదో స్థానంలో ఉంది. ‘కాంతార: చాప్టర్ 1’ 87,900తో ఆరో స్థానంలో, ‘జవాన్’ 86 వేలతో ఏడో స్థానంలో నిలిచాయి. ‘జైలర్ 2’ 85,320తో ఎనిమిదో స్థానంలో, ‘లియో’ 82,400తో తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. 80,150 ట్రెండింగ్‌తో ‘యానిమల్’ పదో స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో ‘ఎంపురాన్’, ‘లియో’ చిత్రాలకు సంబంధించిన గణాంకాలు ప్రీ-సేల్స్ సమయంలో నమోదైనవి.

బాక్సాఫీస్ వద్ద కూడా రామాయణ రికార్డుల వేట కొనసాగిస్తోంది. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మార్కుకు చేరువైంది. భారత్‌లో మొత్తం నెట్‌ వసూళ్లు రూ.238.85 కోట్లు కాగా.. గ్రాస్‌ వసూళ్లు రూ.285.20 కోట్లు. ఓవర్సీస్‌లో రూ.214 కోట్ల గ్రాస్‌ వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.499.20 కోట్లు కొల్లగొట్టింది. దీపావళి సందర్భంగా రామాయణ భారీ వసూళ్లు సాధించింది. భారత్‌లో ఆదివారం రూ.56.15 కోట్ల నెట్‌ వసూళ్లను సాధించింది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన రామాయణలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటించారు. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలుగా వ్యవహరించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చింది.