ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అటు బాలీవుడ్‌లో, ఇటు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. గత ఎనిమిదేళ్లుగా హిందీ ఇండస్ట్రీలో తనకు అవకాశాలు తగ్గడానికి కేవలం ‘పవర్ షిఫ్ట్’ మాత్రమే కాకుండా, కొన్ని ‘కమ్యూనల్ ప్రభావాలు’ (Communal influences) కూడా కారణమై ఉండవచ్చని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం సంచలనంగా మారింది. ఇండస్ట్రీలో తనపై జరుగుతున్న కుట్రల గురించి ఆయన పరోక్షంగా స్పందించడంతో, అసలు రెహమాన్ లాంటి దిగ్గజానికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే చర్చ మొదలైంది. దీనిపై సెలబ్రెటిలు కూడా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయం పై మాట్లాడాడు..
Also Read : Sobhita Dhulipalla: లెక్కలు వేసుకుంటే ఇక్కడ రాణించలేం..
రామ్ గోపాల్ వర్మ, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ అంటే ఒకప్పుడు ఒక సెన్సేషన్. అయితే రెహమాన్ లాంటి దిగ్గజం తో పని చేయడం అందరి వల్ల కాదని, దానికి ఎంతో ఓపిక కావాలని ఆర్జీవీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గతంలో బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘై ‘యువరాజ్’ సినిమా కోసం రెహమాన్‌ను తీసుకున్నప్పుడు జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను వర్మ గుర్తు చేసుకున్నారు. రెహమాన్ పని పూర్తి చేయడంలో చాలా ఆలస్యం చేస్తుంటారని సుభాష్ ఘై కోపంగా ఉండేవారట. ఒకరోజు స్టూడియోకి వచ్చిన రెహమాన్.. అక్కడ సింగర్ సుఖ్వీందర్ సింగ్ కంపోజ్ చేసిన ఒక ట్యూన్ విని, అది బాగుందని సుభాష్ ఘైకి వినిపించారట. అది చూసి షాక్ అయిన ఘై.. ‘నేను నీకు 3 కోట్లు ఇచ్చింది నీ మ్యూజిక్ కోసం, సుఖ్వీందర్ ట్యూన్ కోసం కాదు’ అని రెహమాన్ మీద అరిచారట. దీనికి రెహమాన్ ఏమాత్రం తడబడకుండా చాలా కూల్‌గా ఒక షాకింగ్ ఆన్సర్ ఇచ్చారట.
‘మిస్టర్ ఘై.. మీరు నాకు ఇస్తున్న 3 కోట్లు నా పేరు కోసం, నా బ్రాండ్ కోసం.. అంతే కానీ కేవలం నా పని కోసం కాదు. ఆ విషయం గుర్తుంచుకోండి’ అని ముఖం మీదే చెప్పేశారట. మీకు నచ్చితే ఈ ట్యూన్ ఉంచుకోండి లేదంటే వేరేది ఇస్తాను అని చెప్పి రెహమాన్ అక్కడి నుంచి చెన్నై వెళ్ళిపోయారట. ఈ విషయాన్ని స్వయంగా సుఖ్వీందర్ సింగ్ తనతో చెప్పినట్లు ఆర్జీవీ వెల్లడించారు. ఆ తర్వాతే అదే ట్యూన్ ‘జై హో’గా మారి ఆస్కార్ గెలుచుకోవడం మరో విశేషం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
