RC 17 షురూ.. చిరంజీవి చేతుల మీదుగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం!

Rc 17

Rc 17

RC 17 Movie Launch: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామ్‌చరణ్ – సుకుమార్ కాంబో అధికారికంగా పట్టాలెక్కింది. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ‘RC 17’ ప్రాజెక్ట్‌ను ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర ముహూర్తపు సన్నివేశానికి స్వయంగా క్లాప్ కొట్టారు. తండ్రి చేతుల మీదుగా కొడుకు సినిమా మొదలుకావడంతో మెగా ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు, టెక్నీషియన్లు కూడా ఈ వేడుకకు హాజరై చరణ్, సుకుమార్ జోడీకి శుభాకాంక్షలు తెలిపారు.

సినిమా ఓపెనింగ్ జరగడంతోనే మరోవైపు క్యాస్టింగ్ పై చర్చ జోరందుకుంది. ముఖ్యంగా చరణ్ సరసన హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే సస్పెన్స్ ఇంకా నడుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ పలువురి పేర్లను పరిశీలిస్తున్నప్పటికీ, మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి పేరు అఫిషియల్‌గా బయటికి రాలేదు. త్వరలోనే హీరోయిన్ తో పాటు ఇతర కీలక పాత్రల్లో కనిపించే నటీనటుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ‘రంగస్థలం’తో బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిన ఈ జోడీ, ఈసారి చిరంజీవి ఆశీస్సులతో మరింత భారీ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.