Aneet Padda: టాలీవుడ్‌లోకి ‘సైయారా’ బ్యూటీ ఎంట్రీ?

Aneet Padda Ram Charan Rc17

Aneet Padda Ram Charan Rc17

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ‘RC17’ ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. RC17 ఇంకా అధికారికంగా ప్రారంభం కాకముందే.. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్తలు, రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం లేదనే ప్రచారం నడవగా.. తాజాగా అనిరుద్ లాక్ అయినట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు హీరోయిన్ ఎంపిక అంశం చర్చనీయాంశంగా మారింది. చరణ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోవాలని సుక్కు మొదటి నుంచే ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కియారా అద్వానీ, సారా అర్జున్ వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా ‘సైయారా’ బ్యూటీ అనీత్ పడ్డా పేరు వినిపిస్తోంది.

బాలీవుడ్‌లో సైయారా సినిమాతో అనీత్ పడ్డా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు ‘సలామ్ వెంకీ’ సినిమాలో కనిపించినప్పటికీ.. ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం సైయారా చిత్రమే. గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.550 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విజయంతో ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ‘శక్తి శాలిని’ సినిమాలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ‘హూంకార్’ వెబ్ సిరీస్‌లోనూ తన నటనతో ప్రేక్షకులను అలరించింది. దీంతో ఈ యువ హీరోయిన్ పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో బాగానే వినిపిస్తోంది.

RC17 సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు అక్టోబర్ 26 లేదా 27 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఇటీవల నిర్మాత మైత్రి రవి వెల్లడించారు. ఈ నేపథ్యంలో సినిమా హీరోయిన్ ఎంపికపై మరింత ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో అనీత్ పడ్డా హైదరాబాద్‌లో కనిపించడంతో సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలైంది. ఆమె RC17 సినిమా కోసమే నగరానికి వచ్చిందని అభిమానులు అంటున్నారు. దీంతో రామ్ చరణ్‌కు జోడీగా అనీత్ నటించబోతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. గతంలో కియారా, సారా పేర్లు వినిపించగా.. ఇప్పుడు అనీత్ పేరు తెరపైకి వచ్చింది. మరి సుకుమార్ ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.