రంగస్థలం సినిమా తర్వాత రామచరణ్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అంటే.. లేనే లేదు. కానీ, ‘పెద్ది’ సినిమా చూసిన తర్వాత రామచరణ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరి పెద్దిగాడి పర్ఫార్మెన్స్, చిట్టిబాబుకు మించి ఉందా అంటే.. కచ్చితంగా కంపారిజన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజానికి ఇప్పటికీ కూడా చరణ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే, రంగస్థలం చిట్టిబాబు పాత్రే అని చెప్పాలి. చరణ్‌కు అంతకుమించి స్కోప్ ఉన్న పాత్రలు వచ్చినా చిట్టిబాబునే ది బెస్ట్ అంటారు. ఎందుకంటే, చెవిటోడిగా చరణ్ పండించిన ఎమోషన్ ఇప్పటికీ మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఇన్నాళ్ళైనా కూడా ఆ పాత్ర గురించి మాట్లాడుకుంటున్నామంటే, చిట్టిబాబు ఆడియన్స్‌కు ఎంతలా కనెక్ట్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు.
మరి పెద్దిగాడు, చిట్టిబాబుని మరిపించాడా? పెద్దిగాడి పర్ఫార్మెన్స్ దానికి మించి ఉందా అంటే.. ఉంది, ‘పెద్ది’ లో చరణ్ యాక్టింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, తాను పడిన కష్టం గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అసలు ఇలాంటి సబ్జెక్ట్‌ను చరణ్ లాంటి స్టార్ హీరో ఒప్పుకోవడానికి చాలా గట్స్ ఉండాలి, అందుకే తన వంతుగా సినిమాకు ప్రాణం పెట్టేసాడు. ચరణ్ కెరియర్ ఇప్పటివరకు చూసుకుంటే, ఈ చిత్రానికి పడినంత కష్టం మరే సినిమాకూ పడలేదు. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు. ముఖ్యంగా, ఆ పాత్రకు చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. క్రికెటర్‌గా, కుస్తీ యోధుడిగా, రన్నర్‌గా చరణ్ చూపించిన బాడీ వేరియేషన్స్ మరే హీరో చూపించలేదు. అసలు అంత పెద్ద స్టార్ అయి ఉండి, మెగాస్టార్ కొడుకు అయి ఉండి కూడా ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా అని అనిపించక మానదు. మొత్తం మీద పెద్దిగాడి హార్డ్ వర్క్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ, చిట్టిబాబుకు ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది.
