Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్

Review

Review

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీగా మారిపోయిన ‘పెద్ది’ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కట్ ఏకంగా మూడు నిమిషాల ఏడు సెకండ్ల పాటు సాగింది. ఇందులో రామ్ చరణ్ క్యారెక్టర్‌ను పూర్తిగా రివీల్ చేయకుండా, అతని క్యారెక్టర్ మీద మరింత అంచనాలతో పాటు ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశారు. బొమన్ ఇరానీ క్యారెక్టర్, “ఇక్కడ ఉన్న ప్రతి కుర్రాడికి ఫేవరెట్ గేమ్ మారుతుందేమో కానీ, ఫేవరెట్ ప్లేయర్ మాత్రం పెద్ది అవుతున్నాడు. అతనేమైనా దేవుడా అంటే.. అతను గుళ్లో దేవుడు కాదు, గ్రౌండ్‌లో దేవుడు” అంటూ ఈ సినిమాకి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఎంత ముఖ్యమో చెప్పేలా ఒక డైలాగ్ ఉంది. తర్వాత “ఆటే నా పొగరు” అంటూ రాంచరణ్ చెబుతున్న డైలాగ్ మరింత ఆసక్తి పెంచేలా ఉండగా, జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం అనుమానాలు రేకెత్తించేలా ఉంది.

ఎందుకంటే, ఆమె పాత్ర ఎమ్మెల్యే కుమార్తె పాత్ర అని చెప్పారు కానీ, ట్రైలర్ కట్ మాత్రం అందుకు భిన్నంగా అనిపిస్తోంది. మరోపక్క అప్పలసూరిగా జగపతిబాబుని కూడా రెండు షాట్స్‌లో చూపించి, ఇది వేరే ఇష్యూ ఏదో కూడా డీల్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మరోపక్క దివ్యాంశ శర్మ “ఆట కూలిన కొడుకు” అంటూ రాంచరణ్ పాత్రను మెన్షన్ చేస్తూ చెప్పిన డైలాగ్స్‌తో పాటు, రామ్ చరణ్ అండ్ టీం ఆట వస్తువులతో పాటు కొండలు, గుట్టలు దాటి వెళుతున్నట్లు కనిపిస్తున్న షాట్స్ సినిమా మీద ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. క్రికెట్‌తో పాటు కుస్తీ, అలాగే రన్నింగ్ కూడా ఈ సినిమాలో కనిపించబోతోందని ట్రైలర్‌తో హింట్ ఇచ్చారు. ట్రైలర్‌తో అసలు కథ రివీల్ చేస్తారని ప్రచారం జరిగింది కానీ, కథ పూర్తిగా రివీల్ కాకుండానే సినిమా మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు మేకర్స్.