Ram Charan: డైరెక్టర్ బుచ్చిబాబు సానా – గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా గ్రాండ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ‘బాక్సాఫీస్ ఛాంపియన్ థ్యాంక్యూ మీట్’ ఈ రోజు నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ పాల్గొని, సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో ఎమోషనల్ అవుతూ మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నిజం చెప్పాలంటే సినిమా చూసిన తర్వాత నాకు మాటలు రావట్లేదు. నిన్ననే ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో సాధారణ ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాను. థియేటర్ లోపల రెస్పాన్స్ చూస్తుంటే.. మాస్ థియేటర్లయిన శ్రీరాములు, భ్రమరాంబలలో చూస్తున్నట్లే ఉంది. అసలు చప్పట్లు పడవు అనుకున్న సీన్స్‌కి కూడా ఆడియన్స్ ఇన్స్పైరింగ్‌గా చప్పట్లు కొడుతున్నారు. నా సినీ కెరీర్‌లో, నా లైబ్రరీలో నెంబర్ వన్ లేదా నెంబర్ టూ స్థానంలో నిలిచిపోయే గొప్ప సినిమాను బుచ్చిబాబు నాకు ఇచ్చాడు. కథ విన్న మొదటి రోజే తనిని హగ్ చేసుకున్నాను” అని చెప్పారు.
కథ విన్నప్పుడు రిస్క్ అనుకున్నా.. కానీ
కథలోని రిస్క్ ఫ్యాక్టర్ గురించి చరణ్ ఓపెన్ అయ్యారు. “బుచ్చిబాబు ఈ కథ చెప్పినప్పుడు చాలా రిస్క్ ఉన్న సబ్జెక్ట్ అనిపించింది. ఇది ఎటైనా పోవచ్చు అనుకున్నా. కానీ, ఒకటి మాత్రం నిజం.. మనస్ఫూర్తిగా, స్వచ్ఛమైన మనసుతో కష్టపడి పని చేస్తే అది రేజర్ ఎడ్జ్ కాదు కదా, ఎలాంటి సబ్జెక్ట్ అయినా పక్కా కమర్షియల్ సేఫ్ జోన్ హిట్‌గా మారుతుందని ప్రేక్షకులు నిరూపించారు. ఇండియాలోనే కాదు యూఎస్, యూకే, దుబాయ్ ఇలా ప్రతి చోటా సినిమాకు లవ్ పెరుగుతోంది. థియేటర్లకు పిల్లలు, తల్లిదండ్రులతో పాటు అమ్మమ్మలు, తాతయ్యలు రావడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.
అప్పలసూరి గురించి మాట్లాడుతూ.. “జగపతి బాబు గారి పూర్తి పాత్రను స్క్రీన్‌పై ఫుల్ లెంత్‌లో ఫస్ట్ టైమ్ చూశాను. ఒక ఆర్టిస్ట్‌గా ఆయన ఇన్స్పిరేషనల్ రోల్ చూసి నా కంట్లో నీళ్లు వచ్చాయి. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే శివరాజ్ కుమార్ గారితో పాటు మిగతా ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్. ఇక సెకండ్ హాఫ్‌లో మేమంతా ఎంతో కష్టపడి చేసిన సీన్స్‌ను ఏఆర్ రెహమాన్ గారు తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో వేరే స్థాయికి తీసుకెళ్లారు. రెహమాన్ సార్.. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం” అంటూ రెహమాన్‌ను ప్రశంసించారు. “సతీష్ గారికి, మైత్రీ ప్రొడ్యూసర్స్ రవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాను, 185 రోజుల పాటు షూటింగ్ చేస్తే.. అందులో 165 రోజులు ప్రొడ్యూసర్స్ మా వెంటే ఉన్నారు. మాకు ఒక్క రోజు కూడా నొప్పి తెలియకుండా ఎంతో సరదాగా, హ్యాపీగా షూటింగ్ కంప్లీట్ చేశారు. అలాగే శ్రీరామ్ గారు రాసిన లిరిక్స్ నా ప్లే లిస్ట్‌లో లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. నాకు ఎప్పుడు బాధగా ఉన్నా ఆ పాటలు ఇన్స్పిరేషన్ ఇస్తాయి” అని రవిశంకర్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ వేడుకలో రామ్ చరణ్ స్టేజ్ మీద ఫ్యాన్స్ కోసం తన మీసం తిప్పి ‘పెద్ది’ స్టైల్ లో అలరించారు. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి లైవ్‌లో బైసెప్స్ చూపిస్తూ సందడి చేశారు.

