NTV Telugu Site icon

నో పొలిటికల్ వార్! ఓన్లీ బాక్సాఫీస్ వార్!!

కోలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కు ఒకరంటే ఒకరి ఎంతో అభిమానం. కమల్ బాల నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెడితే, రజనీకాంత్ బస్ కండక్టర్ గా పనిచేస్తూ, యుక్తవయసులో వచ్చాడు. ఇద్దరూ ప్రముఖ దర్శకుడు బాలచందర్ శిష్యులు కావడంతో సహజంగానే వారి మధ్య గాఢానుబంధం ఏర్పడింది. కమల్ యూత్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ను మెప్పిస్తే, రజనీకాంత్ తనదైన బాడీ లాంగ్వేజ్ తో మాస్ గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించున్నాడు. కమల్ నాస్తికుడు, రజనీకాంత్ ఆస్తికుడు. అంతేకాదు… కాస్తంత టైమ్ దొరికితే చాలు హిమాలయాలకు వెళ్ళిపోయి, మానసిక ప్రశాంతతను పొందుతూ ఉంటాడు రజనీ. వ్యక్తిగత అభిరుచుల విషయంలోనూ వీరిద్దరి మధ్య చాలా వ్యత్యాసమే ఉంది. అయినా కానీ ఒకరంటే ఒకరికి బోలెడు ప్రేమ. తమిళనాడకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా కలిసి పోరాడతారు. తమ సంఘీభావాన్ని ప్రకటిస్తారు.


అలాంటి రజనీకాంత్, కమల్ హాసన్ మధ్య ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ జరుగుతుందని జనాలు భావించారు. కమల్ ఇప్పటికే పొలిటికల్ పార్టీ పెట్టగా, రజనీకాంత్ గత డిసెంబర్ లో పార్టీ పెడతాడని, ఈ ఎన్నికల్లో పోటీ చేసి, డీఎంకే, అన్నాడీఎంకే, కమల్ హాసన్ పార్టీలకు చుక్కలు చూపిస్తాడని అనుకున్నారు. కానీ అనారోగ్య కారణంగా రజనీ రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకున్నారు. దాంతో ఈ ఏప్రిల్ 6న పొలిటికల్ ఎరీనాలో రజనీ, కమల్ మధ్య జరగాల్సిన వార్ తప్పిపోయింది. కానీ ఈ యేడాది దీపావళికి మాత్రం వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడే దాఖలాలు కనిపిస్తున్నాయి.


రజనీకాంత్ అనారోగ్యానికి గురి కావడానికంటే ముందే ‘అన్నాత్తే’ చిత్రాన్ని మొదలెట్టాడు. కెమెరామేన్ శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపు కుంటోంది. ఈ సినిమా బ్యాలెన్స్ వర్క్ ను కూడా పూర్తి చేసి, దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయాలని అనుకుంటున్నారట. చిత్రం ఏమంటే… కమల్ హాసన్ కూడా తమిళనాడు ఎన్నికలకు ముందే ‘విక్రమ్’ అనే సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. అనివార్య కారణాల వల్ల అది ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకోలేకపోయింది. ‘మాస్టర్’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను వీలువెంబడి పూర్తి చేసి, దీపావళి కానుకగా విడుదల చేయాలని కమల్ హాసన్ భావించారు. సో… ఆ రకంగా ఇటు రజనీ, అటు కమల్ హాసన్ ఈ సారి దీపావళికి బాక్సాఫీస్ బరిలో అమీతుమీ తేల్చుకోవాలని అనుకుంటున్నారు. ఈ సీనియర్ స్టార్ హీరోలు ఇద్దరూ ఇలా థియేట్రికల్ వార్ కు దిగి దాదాపు 16 సంవత్సరాలు అవుతోంది. 2005లో రజనీకాంత్ ‘చంద్రముఖి’, కమల్ హాసన్ ‘ముంబై ఎక్స్ ప్రెస్’ ఒకే రోజున విడుదలయ్యాయి. అప్పుడు రజనీకాంత్ ది పై చేయి అయ్యింది. మరి ఈ సారి దీపావళికి ఎవరి సినిమా ఎక్కువ ప్రజాదరణ పొందుతుందో చూడాలి.