Site icon NTV Telugu

ఓటీటీ వద్దు… థియేటరే ముద్దు: ఆర్. నారాయణమూర్తి

R Narayana Murthy Comments on Theatres and OTT

ప్రముఖ నిర్మాతలు, నిర్మాణ సంస్థలు తమ చిత్రాలను ఓటీటీ ద్వారా విడుదల చేయడాన్ని ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్. నారాయణమూర్తి తప్పు పట్టారు. ఇవాళ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కేవలం ఇరవై ఐదు శాతం మందికే అందుబాటులో ఉన్నాయని, కొన్ని చిత్రాలను ఓటీటీలో విడుదల చేయడం వల్ల మిగిలిన 75 శాతం మంది ఆ వినోదాన్ని పొందలేకపోతున్నారని అన్నారు. ఇటీవల సురేశ్ బాబు ‘నారప్ప’ సినిమాను ఓటీటీలో విడుదల చేశారని, దానిని కూడా కొద్ది మంది మాత్రమే చూడగలిగారని, వెంకటేశ్ అభిమానులు, సినిమాను అభిమానించే మిగిలిన వారికి ఓటీటీ రిలీజ్ కారణంగా నిరుత్సాహం కలిగిందని అన్నారు.

Read Also : ఇండియాలో “ఎఫ్9” ఎప్పుడంటే ?

కరోనా కు సంబంధించిన నియమ నిబంధనలను పాటిస్తూనే, ప్రభుత్వాలు థియేటర్లు నడపడానికి అనుమతి ఇవ్వాలని, అలానే సినిమా రంగంలోని పెద్దలు మొదట భారీ చిత్రాలను, క్రేజ్ ఉన్న సినిమాలను విడుదల చేస్తే జనం ధైర్యంగా థియేటర్లకు వస్తారని తెలిపారు. థియేటర్లలో సినిమా చూస్తే కలిగే అనుభూతి మరో స్థాయిలో ఉంటుందని, ఇంట్లో టీవీ సెట్స్ లో చూస్తే ఆ ఉత్సాహం కలగదని నారాయణమూర్తి అన్నారు. మనిషి ఉన్నంత వరకూ థియేటర్లు ఉంటాయని, ఆ రకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సినిమా అంటే ఓ పండగ, ఓ జాతర, ఓ తిరనాళ్ళు అని ఆయన అన్నారు. ఇప్పటికే విడుదలైన ‘నారప్ప’ను మినహాయించి, దయచేసి ‘టక్ జగదీశ్, లవ్ స్టోరీ, విరాట పర్వం’ వంటి సినిమాలు థియేటర్లలోనే విడుదల కావాలని, త్వరలోనే తన ‘రైతన్న’ సినిమానూ థియేటర్లలోనే విడుదల చేస్తానని ఆర్. నారాయణమూర్తి చెప్పారు.

Exit mobile version