Maheshwara Reddy: రివ్యూలపై ‘ఓ సుకుమారి’  నిర్మాత షాకింగ్ కామెంట్స్!

Maheswara Reddy

Maheswara Reddy

యంగ్ హీరో తిరువీర్, విలక్షణ నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓ సుకుమారి’. ఈ సినిమా థాంక్యూ మీట్లో నిర్మాత మహేశ్వర రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. స్టేజ్ ఎెక్కిన ఆయన, తనకు సరిగ్గా మాట్లాడటం రాదంటూనే.. మనసులో ఉన్న ఆవేదననంతా లేఖ రూపంలో చదివి వినిపించారు. సినిమాపై జరుగుతున్న ముందస్తు నెగిటివ్ ప్రచారంపై ఆయన తీవ్ర అసంతృప్తిని, బాధను వ్యక్తం చేశారు.

సమావేశంలో నిర్మాత మహేశ్వరా రెడ్డి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం అండి. నాకు పెద్దగా మాట్లాడటం రాదు, అందుకే నా మనసులోని మాటలను రాసుకొని మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది కేవలం సినిమా గురించి మాట్లాడటానికి మాత్రమే కాదు.. ఒక ప్రొడ్యూసర్‌గా, ఒక సామాన్య వ్యక్తిగా నా గుండెల్లో దాగున్న మనోవేదనను మీతో పంచుకోవడానికి” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. “బయట నుంచి చూసేవాళ్లకు సినిమా అంటే కేవలం రెండు గంటల వినోదంగానే కనిపించవచ్చు. కానీ, ఆ రెండు గంటల అవుట్‌పుట్ వెనుక కొన్ని సంవత్సరాల కష్టం దాగి ఉంటుంది. ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్లు రాత్రింబవళ్లు మనసుపెట్టి పని చేస్తేనే ఒక కల నిజ రూపం దాల్చుతుంది. నేను కూడా అదే నమ్మకంతో, సినిమాపై ప్రేమతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాను. మా కష్టాన్ని, సినిమా కంటెంట్‌ను నమ్మి డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ భాగస్వాములు ముందుకు రావడం నిజంగా మాకు దక్కిన మొదటి విజయం” అని ఆయన పేర్కొన్నారు.

సినిమా విడుదలైన వెంటనే వచ్చిన కొన్ని రివ్యూలు తనను తీవ్రంగా కలచివేశాయని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. “సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని చెప్పడం వేరు. కానీ, అసలు జనాలు థియేటర్లలోకి అడుగు పెట్టక ముందే సినిమాపై ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ సృష్టించడం ఎంతవరకు న్యాయం? మేము ఎప్పుడూ విమర్శలను తప్పుపట్టం, వాటిని మనస్ఫూర్తిగా గౌరవిస్తాం. మంచి చెప్పినా, లోపాలను ఎత్తి చూపినా మా తదుపరి సినిమాలను మెరుగుపరుచుకోవడానికి అవి ఉపయోగపడతాయి. కానీ ఆ విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ, సినిమాను చంపేసేలా ఉండకూడదు” అని హితవు పలికారు.

 ఒక సినిమా విజయం లేదా అపజయాన్ని నిర్ణయించే పూర్తి హక్కు కేవలం ప్రేక్షకుడికి మాత్రమే ఉండాలని మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. “ఒక సినిమా వెనుక కేవలం నిర్మాత మాత్రమే కాదు.. వందల మంది సినిమా కార్మికుల జీవితాలు, వారి కుటుంబాల జీవనాధారం దాగి ఉంటాయి. మీడియా మిత్రులకు, రివ్యూవర్లకు నాదొకటే చిన్న విజ్ఞప్తి.. మీ వాయిస్ చాలా పవర్ఫుల్, దయచేసి దాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించండి. మీ రివ్యూలతో ప్రేక్షకులను ముందే ప్రభావితం చేయకుండా, ఒక్కసారి వారిని థియేటర్‌కు వచ్చి సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వండి” అని కోరారు.