Producer C. Kalyan: ఒకప్పుడు చిన్న సినిమాల నిర్మాతగా పయనం మొదలుపెట్టి, నేడు అగ్రకథానాయకులతోనూ చిత్రాలు నిర్మించే స్థాయికి చేరుకున్నారు సి.కళ్యాణ్. తెలుగు సినిమా రంగంలో పలు శాఖల్లో అధ్యక్షునిగా పనిచేసిన సి.కళ్యాణ్, ఒకప్పుడు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ గానూ సేవలు అందించారు. తెలుగు చిత్రసీమలో సి.కళ్యాణ్ అందరికీ తలలో నాలుకలా ఉంటారు. అందరివాడు అనిపించుకుంటారు. అందరితోనూ కలసి పోతుంటారు. సినిమా రంగంలో ఏ సమస్య వచ్చినా, అందుకు తగ్గ పరిష్కారం కోసం సినీపెద్దలతో చర్చించడంలోనూ, ప్రభుత్వాలతో మంతనాలు జరపడంలోనూ ముందుంటారు.
నెల్లూరు జిల్లాలో సి.కళ్యాణ్ జన్మించారు. చిత్రసీమపై మనసు పారేసుకొని, మదరాసు చేరారు. అక్కడ దొరికిన అవకాశాన్నల్లా ఉపయోగించుకుంటూ ముందుకు సాగారు. కొన్ని చిన్న చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ‘శ్రీఅమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్’ పతాకంపై సి.కళ్యాణ్ సమర్ఫణలో “వద్దు బావా తప్పు, లేడీస్ డాక్టర్” వంటి చిత్రాలు రూపొందాయి. తాను చిన్న నిర్మాత అయినా, ఇతర నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేతనైన సాయం చేసి ఆదుకొనేవారు. అందువల్లే సి.కళ్యాణ్ అందరివాడు అనిపించుకున్నారు.
Read also: Santhosh Shobhan: సంక్రాంతికే యంగ్ హీరో కళ్యాణం… కమనీయం!
శ్రీహరి హీరోగా సి.కళ్యాణ్ నిర్మించిన ‘బలరామ్’ మంచి విజయం సాధించింది. ఆయన సోదరుడు సి.వెంకటేశ్వరరావు నిర్మాతగా, సి. కళ్యాణ్ సమర్పకుడిగా చిత్రాలు నిర్మించేవారు. కృష్ణవంశీ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన ‘చందమామ’ మంచి విజయం సాధించి, కళ్యాణ్ కు తొలి విజయాన్ని అందించింది. ఆ తరువాత తమ సొంత బ్యానర్ సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపైనా, ఇతర నిర్మాతలతోనూ కలసి చిత్రనిర్మాణం సాగించారు. మహేశ్ బాబుతో ‘ఖలేజా’, నితిన్ తో ‘ఆటాడిస్తా’, నానితో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’, వరుణ్ తేజ్ తో ‘లోఫర్’, సాయిధరమ్ తో ‘ఇంటెలిజెంట్’, ఛార్మితో ‘జ్యోతిలక్ష్మి’ , రాజశేఖర్ తో ‘కల్కి’ వంటి చిత్రాలతో పాటు కొన్ని అనువాద చిత్రాలనూ అందించారు సి.కళ్యాణ్. బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ‘పరమవీరచక్ర’ నిర్మించారు. తరువాత బాలకృష్ణతో ‘జైసింహా, రూలర్’ వంటి చిత్రాలనూ తెరకెక్కించారు. అప్పట్లో విజయం సాధించిన ‘జై సింహా’ శతదినోత్సవాన్ని చిలకలూరి పేటలో ఘనంగానూ నిర్వహించారు.
ఆ మధ్య సత్యదేవ్ హీరోగా ‘గాడ్సే’, రానా హీరోగా ‘1945’ అనే సినిమాను నిర్మించారు. కళ్యాణ్ భార్య కోనేరు కల్పన నిర్మాతగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘ఆర్గానిక్ మామ- హైబ్రిడ్ అల్లుడు’ తెరకెక్కుతోంది. ప్రస్తుతం కళ్యాణ్ చెన్నైలో ఓ అమ్యూజ్ మెంట్ పార్క్ నిర్మాణ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తాను ఎంత బిజీగా ఉన్నా, సినిమా రంగానికి తన సేవలు అవసరం అనుకున్న వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటారు కళ్యాణ్. ఆయన మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.
CM KCR: బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
