NTV Telugu Site icon

భర్తతో గొడవలు… ప్రియమణి రియాక్షన్…!

Priyamani Opens up about her husband

సీనియర్ హీరోయిన్ ప్రియమణి పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తేనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. పెళ్లి తర్వాత ఆమె పాత్రల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ లో కనిపించింది. ఇందులో ప్రియమణి ఇద్దరు పిల్లలకు తల్లిగా, ఇల్లాలిగా నటించి మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి తన భర్త ముస్తఫా రాజ్ కు తనకు మధ్య ఉన్న విభేదాల గురించి ఓపెన్ అయింది. “నా భర్తకు నాకు మధ్య తరచూ అపార్ధాలు చోటు చేసుకుంటాయి. కానీ మేము ఎప్పుడూ ఒకరినొకరు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఆయన చాలా సపోర్టివ్. నా కెరీర్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టమని ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన నా జీవిత భాగస్వామి అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అంతేకాదు పెళ్లి తర్వాత నా కెరీర్ మలుపు తిరిగింది. ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న మంచి పాత్రల్లో నటించే అవకాశం లభిస్తోంది” అని చెప్పుకొచ్చింది. ఇక సినిమా పరిశ్రమపై కోవిడ్ ప్రభావం బాగా పడిందని, అందుకే తన వేతనం తగ్గించుకోవడం ద్వారా నిర్మాతలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రియమణి వెల్లడించింది. ప్రస్తుతం ప్రియమణి “నారప్ప” చిత్రంలో నటిస్తోంది. ఇందులో వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత “నారప్ప” థియేటర్లలోకి రానుంది.