Site icon NTV Telugu

“మా” వివాదం : ఇది శాంపిల్ మాత్రమే… ఆధారాలతో ప్రకాష్ రాజ్ ట్వీట్

Prakash Raj going to court on MAA Elections

‘మా’ ఎన్నికల వివాదం ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలతో మరో కీలక మలుపు తీసుకుంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఏపీ రౌడీ షీటర్లు ఓటర్లను బెదిరించారని, ఓట్ల లెక్కింపు సమయంలో నూకల సాంబశివరావు అనే రౌడీషీటర్ కౌంటింగ్ హాల్ లోనే ఉన్నాడని, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో అతనిపై రౌడీ షీట్ తో పాటు హత్య కేసు కూడా ఉందని, ముగ్గురు ఎస్ఐలను కొట్టాడని ఆరోపించారు ప్రకాష్ రాజ్. ఈ నెల 14వ తేదీన ఈ విషయంపై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఫలితం లేదని చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన తన ఆరోపణలకు సంబంధించి ఆధారాలతో సహా కొన్ని ఫోటోలను, అలాగే ఎన్నికల అధికారికి వారు రాసిన లేఖను ట్వీట్ చేశారు.

Read Also : ‘మా’ ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్

“మా ఎలక్షన్స్ 2021… ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ గారు ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే… సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి… ఎన్నికలలో ఏం జరిగిందో ప్రపంచానికి తెలిసేలా చేస్తాము. ఎలక్షన్స్ ఎలా జరిగాయి? జస్ట్ ఆస్కింగ్ ” అంటూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో ప్రకాష్ రాజ్ రౌడీ షీటర్ అని ఆరోపిస్తున్న సాంబశివరావు ఎన్నికలు జరుగుతున్న సమయంలో మోహన్ బాబు పక్కనే ఉండడం కనిపిస్తోంది. కేవలం ఎన్నికల్లోనే కాకుండా అతను మోహన్ బాబు కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ఇక ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కూడా కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు ప్రకాష్ రాజ్. దీంతో ఈ ఎన్నికలలో ఏపీ రాజకీయాలు కూడా ఎంట్రీ అయ్యాయా? అనే అనుమానం కలుగుతోంది. దీనిపై మంచు విష్ణు ప్యానల్, మోహన్ బాబు, అలాగే ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version