పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం హిందీ, తెలుగు వెర్షన్లకు రెండు వేర్వేరు సౌండ్‌ట్రాక్ లు ఉన్నాయి. హిందీలో మిథూన్, మనన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా, జస్టిన్ ప్రభాకరన్ తెలుగు వెర్షన్‌లో పాటలు కంపోజ్ చేస్తున్నారు. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ – వంశీ – ప్రమోద్ – ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. దీంతో టాలీవుడ్‌లోని చాలా సినిమాలు ఇప్పటికే విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘రాధే శ్యామ్’ విడుదల కూడా వాయిదా పడుతుందని అంతా ఊహించారు. కానీ సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ‘రాధేశ్యామ్’ మేకర్స్ అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. అయితే రానున్న రోజుల్లో కరోనా వల్ల పరిస్థితులు మరింతగా దిగజారితే మాత్రం ‘రాధే శ్యామ్’ రిలీజ్ వాయిదా పడక తప్పదు. రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం విడుదల గురించి ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.