Prabhas-Fauzi: 15 నిమిషాలు ఊచకోతే.. ‘ఫౌజీ’లో అదే మ్యాడ్ సీక్వెన్స్!

Prabhas Fauzi

Prabhas Fauzi

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చిత్ర బృందం ఫౌజీ నుంచి ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్ ప్రభాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టింది. అప్‌డేట్ కోసం ఎన్నో రోజులు ఎదురుచూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఫౌజీ గ్లింప్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను పరిచయం చేస్తూ.. ప్రభాస్ పాత్రను చూపించారు. బ్రిటిష్ వారిని ఎదుర్కొనే వీర సైనికుడిగా ప్రభాస్ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్ అనే ఎలివేషన్, భారీ రైఫిల్‌తో ప్రభాస్ కనిపించే సన్నివేశాలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. బ్రిటిష్ వారిని హెచ్చరిస్తూ ప్రభాస్ చెప్పే డైలాగ్స్ కూడా గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచాయి.

ఇక ఫౌజీలో ప్రభాస్ ఒక స్పైగా కనిపించనున్నట్లు గ్లింప్స్ ద్వారా స్పష్టమైంది. ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టుగా భారీ యాక్షన్ సన్నివేశాలను రూపొందించినట్లు ఈ వీడియోలోని విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా గ్లింప్స్‌లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్ సుమారు 15 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. ఈ సీక్వెన్స్ సాధారణ స్థాయిలో కాకుండా.. భారీగా తెరకెక్కించినట్లు, దాని అవుట్‌పుట్ కూడా అద్భుతంగా వచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సినిమాలో మ్యాడ్ సీక్వెన్స్ అట.

ఫౌజీలో ప్రభాస్, ఇమాన్వితో పాటు సుబోధ్ భవే, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రస్తావన, ప్రభాస్ స్పై పాత్ర, భారీ యాక్షన్ సన్నివేశాలతో ఫౌజీపై ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.