Pawan Kalyan – Dil Raju: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అగ్ర నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘వకీల్ సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో సెట్ కాబోతుందా? అంటే టాలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్‌ను దిల్ రాజు ప్రత్యేకంగా కలవడంతో వీరిద్దరి మధ్య ఏదో భారీ ప్రాజెక్ట్ చర్చకు వచ్చిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన దిల్ రాజు, ఈ భేటీ వెనుక ఉన్న అసలు విషయాన్ని బయటపెడుతూ పవన్ అభిమానులకు ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్‌ను ఎందుకు కలిశారంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు దిల్ రాజు స్పందిస్తూ.. “ఒక నిర్మాతగా, గతంలో ఆయనతో ‘వకీల్ సాబ్’ లాంటి సినిమా తీసిన ప్రొడ్యూసర్‌గా.. మళ్లీ అవకాశం ఉంటే ఒక సినిమా చేద్దామనే ఆలోచనతోనే కళ్యాణ్ గారిని కలిశాను” అని స్పష్టం చేశారు. ఇద్దరం కలిసి ఉన్న ఫోటోలు అందరూ చూసే ఉంటారని, ఆ కలయిక ఎంత సంతోషంగా సాగిందో మీకే తెలుసంటూ తనదైన శైలిలో నవ్వుతూ బదులిచ్చారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ క్రేజీ సీక్వెల్ ‘ఓజీ 2’ మీ బ్యానర్‌లో తెరకెక్కబోతోందా అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
దీనిపై దిల్ రాజు స్పందిస్తూ.. “నేను చెప్పింది ఏంటి? మీరు అడుగుతున్నది ఏంటి?” అంటూ ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. ‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ కళ్యాణ్‌తో మరోసారి సినిమా చేసే అవకాశం వస్తే, అంతకుమించి ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించాలన్నదే తన ప్రధాన ఉద్దేశమని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆ దిశగానే తాను అడుగులు వేస్తున్నానని, ఈ ప్రాజెక్ట్ ఎలా రూపుదిద్దుకుంటుందనేది త్వరలోనే అన్నీ ప్రాపర్‌గా సెట్ అయ్యాక అధికారికంగా తెలుస్తుందని దిల్ రాజు హింట్ ఇచ్చారు. మొత్తానికి ‘వకీల్ సాబ్’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తుండటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

