NTR-Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో ఒక భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆదర్శ కుటుంబం’ ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్‌ను డైరెక్టర్ త్రివిక్రమ్ స్వయంగా వెల్లడించడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘ఆదర్శ కుటుంబం’ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ సుమ కనకాల తారక్, త్రివిక్రమ్ కలిసి ఉన్న ఫోటోను చూపిస్తూ.. ‘‘త్రివిక్రమ్ గారు.. నెక్స్ట్ ఇది జరగబోతుందా అండి?’’ అని నేరుగా ప్రశ్నించారు. దీనికి త్రివిక్రమ్ ఏమాత్రం దాపరికం లేకుండా, చిరునవ్వుతో ఒక్క ముక్కలో ‘‘అవును’’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అత్యంత కీలకమైన అప్‌డేట్‌ను కూడా త్రివిక్రమ్ రివీల్ చేశారు. సినిమా స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధమైపోయిందని ఆయన స్పష్టం చేశారు. ఇక టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారన్న విషయమై మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జనవరిలోనే ఈ చిత్ర టైటిల్‌ను అధికారికంగా అనౌన్స్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. భావోద్వేగాలు, పవర్‌ఫుల్ డైలాగులు, యాక్షన్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఈ జోడీ.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ జతకడుతుండటంతో టాలీవుడ్ వర్గాల్లో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అవ్వడం, జనవరిలోనే టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉండనుండటంతో వచ్చే న్యూ ఇయర్ వేళ తారక్ అభిమానులకు పక్కా పండుగ ఖాయంగా కనిపిస్తోంది.

