గత యేడాది మార్చిలో కరోనా వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వమే లాక్ డౌన్ ప్రకటించడంతో కాస్తంత త్వరగా మేలుకున్న సినిమా రంగం థియేటర్లను, షూటింగ్స్ ను ఆపేసింది. ప్రభుత్వమే పరిస్థితులు కొంతమేరకు చక్కబడ్డాక అన్ లాక్ పేరుతో ఒక్కో రంగానికీ వెసులు బాటు కల్పించింది. ఆ రకంగా జూలైలో పలు జాగ్రత్తలతో షూటింగ్స్ మొదలు కాగా, డిసెంబర్ లో థియేటర్లు తెరుచుకున్నాయి. ఇక ఫిబ్రవరి మొదటివారంలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి లభించింది. కానీ ఈ తతంగం అంతా మూడు నాళ్ళ ముచ్చట అన్నట్టయ్యింది.
మార్చి నెలాఖరును నుండి కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో పక్క రాష్ట్రాలు కొన్ని థియేటర్లు బంద్ చేయడం, మరికొన్ని ఆక్యుపెన్సీని సగానికి తగ్గించడం జరిగింది. ఇక్కడా అదే పరిస్థితి నెలకొంటుందని ఊహించిన ‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం’ చిత్రాల నిర్మాతలు తమ సినిమాల విడుదలను వాయిదా వేశారు. ఇక సెట్స్ పై ఉన్న చిత్రాలు సైతం నిదానంగా షూటింగ్ ను బంద్ చేశాయి. చిరంజీవి ‘ఆచార్య’, ఎన్టీయార్, రామ్ చరణ్ ‘ట్రిపుల్ ఆర్’, రవితేజ ‘ఖిలాడీ’తో పాటు కొత్త సినిమా… ఇంకా కొన్ని చిత్రాల షెడ్యూల్స్ అర్థాంతరంగా ఆగిపోయాయి. పరిస్థితి ఎటుకు దారితీస్తుందో తెలియక అయోమయంలో ఉన్న నిర్మాతలకు ఇప్పుడు పరిస్థితి మరీ అగమ్య గోచరంగా మారిపోయింది. ఇక్కడ తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పెట్టారు. రాత్రి 8 గంటలకల్లా థియేటర్లు మూసేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఫస్ట్ షో టైమింగ్స్ మార్చుకోవాలి లేదంటే రద్దు చేసుకోవాలి. ఇక సెకండ్ షో లు నిలిపి వేయాల్సిందే! ఇక ఉదయం పూట యాభై శాతం ఆక్యుపెన్సీపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే… ఆంధ్రలో థియేటర్లలో యాభై శాతం ఆక్యుపెన్సీ ని పెట్టేశారు. మీడియం బడ్జెట్ చిత్రాల విడుదల వాయిదా పడటంతో తమ సినిమాలను విడుదల చేయాలని భావించిన చిన్న చిత్రాల నిర్మాతలకు సైతం ఎటూ పాలుపోకుండా ఉంది. ఎందుకంటే ఈ నెల ద్వితీయార్థంలో ‘ఇష్క్, శుక్ర, ఏక్ మినీ కథ’తో పాటు మరో ఏడెనిమిది చిన్న చిత్రాలు సైతం విడుదల కావాల్సి ఉంది. వీటి పరిస్థితి ఏమిటో వేచి చూడాలి.