Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్‌ సంచలన పోస్ట్‌!

Youtuber Nandu

Youtuber Nandu

గత కొంతకాలంగా యూకే వీసా, ఉద్యోగ మోసాల ఆరోపణలతో తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖ తెలుగు యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ (రమ నందన) కుటుంబానికి యూకే న్యాయస్థానంలో భారీ ఊరట లభించినట్లు తెలుస్తోంది. తమపై వచ్చిన ఆరోపణలను కొట్టివేస్తూ యూకే కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ప్రకటిస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు. వీసా స్పాన్సర్‌షిప్ పేరిట నిరుద్యోగులను మోసం చేశారంటూ ఆంధ్రప్రదేశ్‌లో కేసులు నమోదు కావడం, సెప్టెంబర్‌లో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు నందనను ఆపడం వంటి పరిణామాలతో ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. టీవీ చర్చలు, యూట్యూబ్ వేదికలపై విస్తృతమైన ఆరోపణలు, సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ జరిగిన తర్వాత నందూ కుటుంబం మొదటిసారి న్యాయపరమైన విజయంపై స్పందించింది.

“హెడ్‌లైన్లు తీర్పులు కావు, కేవలం ఆరోపణలు చేసినంత మాత్రాన అవి రుజువులు అయిపోవు. ప్రజాభిప్రాయం ఎప్పటికీ చట్టానికి ప్రత్యామ్నాయం కాలేదు.” తీవ్రమైన వ్యతిరేకత, టీవీ ముఖాముఖులు, బహిరంగ ఆరోపణలు ఎదురైనప్పటికీ తాము సహనంతో న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచామని ఆమె పేర్కొన్నారు. “ఊహాగానాలను పక్కనపెట్టి, న్యాయస్థానం ఇచ్చిన తీర్పునే మాట్లాడనిద్దాం” అంటూ మీడియా విచారణను (Media Trial) ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.  2026 అక్టోబర్ 15 తమ జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని రోజని, సత్యమే గెలిచిందని నందన తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. అయితే, ఈ ప్రకటన యూకే కోర్టు పరిధిలోని వ్యవహారానికి సంబంధించినదా లేక స్వదేశంలో నమోదైన కేసులపై కూడా ప్రభావం చూపుతుందా అనే దానిపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నందూ కుటుంబం తమ పోరాటంలో నిలబడిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతూ, గౌరవంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేసింది.