NTV Telugu Site icon

అనితరసాధ్యుడు… నందమూరి బాలకృష్ణ!

ప్రస్తుతం భారతీయ చలనచిత్రసీమలో నటవారసుల హవా విశేషంగా వీస్తోంది. భారతీయ చిత్రసీమలో నటవారసత్వానికి బీజం వేసిన వారు మహానటుడు పృథ్వీరాజ్ కపూర్. దక్షిణాదిన అదే బాటలో సాగారు నటరత్న యన్టీఆర్. ఆ తరువాత నార్త్ లోనూ, సౌత్ లోనూ ఎందరో నటీనటులు తమ వారసులను చిత్రసీమలో ప్రవేశ పెట్టారు. అనేక మంది స్టార్స్ గా విజయం సాధించారు. తమ కన్నవారి పేరు నిలిపారు. అలా జయకేతనం ఎగురవేసిన నటవారసుల్లో నందమూరి బాలకృష్ణ స్థానం ప్రత్యేకమైనది. 1974లో ‘తాతమ్మకల’తో నటుడిగా పరిచయమైన బాలకృష్ణ నటునిగా 48 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. హీరోగా 38 సంవత్సరాలు పూర్తి చేసుకొని, ఇప్పటికీ స్టార్ హీరోగానే సాగుతున్నారు. బాలనటులుగా పరిచయమై, బాలయ్య కంటే ఎక్కువ కాలం చిత్రసీమలో ఉన్నవారు లేకపోలేదు. అయితే బాలయ్యలాగా 38 ఏళ్ళ నుంచీ స్టార్ గా కొనసాగడం అన్నది అరుదైన విషయమనే చెప్పాలి. ఈ విషయంలో ఆయన దరిదాపుల్లో మరో నటవారసుడు కనిపించరు. కేవలం స్టార్ గా కొనసాగుతూ ఉండడం కాదు, తెలుగు చిత్రసీమలో తరిగిపోని, చెరిగిపోని రికార్డులు నెలకొల్పిన ఘనత సైతం బాలయ్య సొంతం. బాలకృష్ణ నెలకొల్పిన అరుదైన రికార్డులను తలచుకుంటూనే ఆయన అభిమానులు ఈ నాటికీ ఆనందంతో చిందులు వేస్తున్నారు.

తండ్రి చాటు బిడ్డగా…
‘తాతమ్మ కల’తో తొలిసారి కెమెరా ముందు నటించిన బాలకృష్ణ, తరువాత
పదేళ్ళ పాటు తండ్రి యన్టీఆర్ చాటు బిడ్డగానే ఉన్నారు. తండ్రితో కలసి “తాతమ్మకల, అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి, దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాటపర్వము, శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, రౌడీరాముడు-కొంటె కృష్ణుడు, అనురాగదేవత, సింహం నవ్వింది, శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర” వంటి చిత్రాలలో నటించారు బాలయ్య. తండ్రి దర్శకత్వంలో నటించడం వల్ల నటనకు సంబంధించిన పలు అంశాల్లో ప్రావీణ్యం సంపాదించారు బాలకృష్ణ. యన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత 1984లో సోలో హీరోగా బాలకృష్ణ అడుగు పెట్టారు. ఆరంభంలో “సాహసమే జీవితం, డిస్కోకింగ్, జననీ జన్మభూమి” చిత్రాలు వరుసగా ఆయనకు పరాజయాలను చూపాయి. దాంతో బాలయ్య పని అయిపోయిందని, వైరివర్గాలు చాటింపు వేశాయి. అప్పటికే యన్టీఆర్ ముఖ్యమంత్రి కావడంతో ఆయన రాజకీయ ప్రత్యర్థులు బాలయ్య కంటే ఇతరులు మేలని టముకు వేయడం మొదలెట్టారు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలోనూ బాలకృష్ణ నెట్టుకు రావడం గమనార్హం! ఆయన నటించిన నాల్గవ చిత్రం ‘మంగమ్మగారి మనవడు’ సంచలన విజయం సాధించి, పోటీ చిత్రాలను మట్టి కరిపించింది. ఇక అప్పటి నుంచీ బాలయ్య మరి వెనుదిరిగి చూసుకోలేదు.

అరుదైన ‘డబుల్ హ్యాట్రిక్’!
‘మంగమ్మగారి మనవడు’ ఘనవిజయం బాలయ్య అభిమానులకు ఆనందం పంచింది. ఆ సినిమా హైదరాబాద్ లో అత్యధిక రోజులు ప్రదర్శితమై ఈ నాటికీ ఓ రికార్డుగా నిలచే ఉంది. ఇక 1986లో అయితే ఏకంగా “ముద్దుల క్రిష్ణయ్య, సీతారామకళ్యాణం, అనసూయమ్మగారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు” చిత్రాలతో వరుస విజయాలు చూశారు బాలయ్య. ఆ యేడాది బాలయ్య డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అలాంటి రికార్డు ఈ నాటికీ మరెవ్వరూ అందుకోలేదు. బాలకృష్ణ చిత్రసీమలో అడుగుపెట్టే నాటికి ఉన్న టాప్ స్టార్స్ ను అతి తక్కువ కాలంలోనే అవలీలగా అధిగమించారు. అప్పట్లో అందరికంటే అత్యధిక పారితోషికం అందుకున్నారు. ఇక బాలయ్య సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అన్నపేరుండేది. 1980ల మధ్యకాలంలో తెలుగు సినిమా స్లంప్ ను ఎదుర్కొంది. ఆ సమయంలో స్లంప్ ఎరుగని ఏకైక హీరోగా బాలకృష్ణ సాగారు.

చెరిగిపోని రికార్డులు!
ఈ తరం టాప్ స్టార్స్ లో పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనూ నటించి అలరించిన ఘనత కూడా బాలకృష్ణ ఒక్కడికే సొంతమయింది. ఈ విషయాన్ని సాటి స్టార్స్ సైతం అంగీకరిస్తారు. ఇక నటవారసుల్లో అయితే బాలయ్య స్థాయి సక్సెస్ రేట్ మరెవరికీ లేదనే చెప్పాలి. తెలుగు చిత్రసీమలో యన్టీఆర్ తరువాత అత్యధిక స్వర్ణోత్సవాలు కలిగిన హీరోగానూ బాలయ్య చరిత్ర సృష్టించారు. “మంగమ్మగారి మనవడు, ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, లెజెండ్” చిత్రాలు గోల్డెన్ జూబ్లీ జరుపుకోగా, వాటిలో ‘మంగమ్మగారి మనవడు, లెజెండ్’ చిత్రాలు ప్లాటినమ్ జూబ్లీ జరుపుకున్నాయి. ఇక హైదరాబాద్ లో అత్యధికంగా 565 రోజులు ప్రదర్శితమైన ఏకైక తెలుగు చిత్రంగా ‘మంగమ్మగారి మనవడు’ నిలచింది. దక్షిణాదిన 1116 రోజులు ఆడిన ఏకైక చిత్రంగా ‘లెజెండ్’ చరిత్ర సృష్టించింది.

‘అఖండ’వైపే అందరి చూపు…
నవతరం హీరోలకు సైతం దీటుగా సాగిన బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అఖండ’పైనే ఆయన అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రంగా ‘అఖండ’ టీజర్ తోనే సంచలనం సృష్టించింది. అందుకు కారణం- గతంలో బాలయ్య, బోయపాటి కాంబోలో రూపొంది అరుదైన విజయాలను సొంతం చేసుకున్న ‘సింహా, లెజెండ్’ చిత్రాలే! బాలయ్య కెరీర్ లో ఈ మధ్య వసూళ్ళ వర్షం కురిపించిన చిత్రాలు అరుదనే చెప్పాలి. పైగా యువతరం హీరోల సినిమాల స్థాయి కలెక్షన్లు ఆయన సినిమాలకు లభించలేదు. ఈ నేపథ్యంలో ‘అఖండ’కు అఖండ విజయం చేకూర్చాలని దశదిశలా ఉన్న బాలయ్య అభిమానులు ఆశిస్తున్నారు. అక్టోబర్ లో దసరా కానుకగా ‘అఖండ’ రానుందని వినిపిస్తోంది. మరి, ఆ సమయంలో ‘అఖండ’కు అభిమానులు ఏ స్థాయి విజయాన్ని అందిస్తారో చూడాలి.

(జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు)