Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!

Shikhar Dhawan, Nana Patekar, Ajinkya Rahane

Shikhar Dhawan, Nana Patekar, Ajinkya Rahane

Shikhar Dhawan, Ajinkya Rahane Pay Tribute To Nana Patekar: ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (75) ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా ఆయన మృతి చెందారు. భారతీయ సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన మరణవార్తతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు. నానా పటేకర్ మృతిపై సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాజీ భారత క్రికెటర్లు శిఖర్ ధావన్, అజింక్య రహానే ఆయనకు నివాళులర్పించారు. నానా పటేకర్ నటన తరతరాలకు స్ఫూర్తినిస్తుందని, ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించారని కొనియాడారు.

నానా పటేకర్ మృతి పట్ల శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. భారతీయ సినిమా ఒక గొప్ప ప్రతిభావంతుడిని కోల్పోయిందని పేర్కొన్నాడు. ‘భారతీయ సినిమా ఈరోజు ఒక గొప్ప ప్రతిభావంతుడిని కోల్పోయింది. నానా పటేకర్ సాబ్.. మీ నటన తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఓం శాంతి’ అంటూ గబ్బర్ తన సంతాపాన్ని తెలియజేశాడు. నానా పటేకర్ అసాధారణ నటుడని, తన నటనతో ఎన్నో తరాల ప్రేక్షకులకు స్ఫూర్తినివ్వడంతో పాటు వినోదాన్ని అందించారని అజింక్య రహానే పేర్కొన్నాడు. ఆయన మరణవార్త విని ఎంతో బాధ కలిగిందని, నానా పటేకర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు జింక్స్ తెలిపాడు.

నానా పటేకర్ ఈరోజు ఉదయం 5:20 గంటలకు కార్డియాక్‌ అరెస్ట్‌తో కన్నుమూసినట్లు మణిపాల్ ఆస్పత్రి ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ శేఖర్ సాల్కర్ ఏఎన్‌ఐకి తెలిపారు. గోవాలోని తన నివాసంలో ఆయన అపస్మారక స్థితిలో కనిపించడంతో వైద్య సహాయం అందించారు. దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు. హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో నానా పటేకర్ ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు. 1978లో విడుదలైన ‘గమన్’ చిత్రంతో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ‘పరిం దా’, ‘ప్రహార్’, ‘అంగార్’, ‘క్రాంతివీర్’, ‘తిరంగా’, ‘ఖామోషి’, ‘అబ్ తక్ ఛప్పన్’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. గంభీరమైన పాత్రలైనా, భావోద్వేగ సన్నివేశాలైనా తనదైన శైలిలో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

వయసు పెరుగుతున్నప్పటికీ నానా పటేకర్ సినిమాల్లో నటించడం కొనసాగించారు. ఇటీవల అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్‌ముఖ్ తదితరులు నటించిన ‘హౌస్‌ఫుల్ 5’లో కనిపించారు. అలాగే షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓ రోమియో’లో పోలీసు అధికారిగా నటించారు. అనిల్ కపూర్, రాధికా మదన్ నటించిన ‘సుబేదార్’ చిత్రంలోనూ అతిథి పాత్రలో కనిపించారు. తన అసాధారణ నటనతో భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసిన నానా పటేకర్ జ్ఞాపకాలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి.