Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!

Nagarjuna Comments

Nagarjuna Comments

Akkineni Nagarjuna: సినిమా రంగంలోకి అడుగుపెట్టే ప్రతి కొత్త హీరోకు మొదటి సినిమా విడుదల సమయం ఓ అగ్నిపరీక్ష లాంటిది. నెలల తరబడి పడిన కష్టం, భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలు ప్రేక్షకుల తీర్పుపైనే ఆధారపడి ఉంటాయి. అయితే, తొలి సినిమా విడుదలకు ముందు నటీనటులు పడే ఆందోళన, నేటితరం ఎదుర్కొంటున్న పరిస్థితులపై సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. తొలి సినిమా విడుదల వేళ ఉండే మానసిక ఒత్తిడి గురించి నాగార్జున మాట్లాడుతూ.. “మొదటి చిత్రం రిలీజ్‌కు ముందు రోజుల్లో మనసులో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి. సినిమా కోసం ప్రాణం పెట్టి కష్టపడతాం, ఆ గుర్తింపును కాపాడుకోవడానికి నిరంతరం పరిగెడుతూనే ఉండాలి.

ముఖ్యంగా ఇండస్ట్రీకి కొత్తగా పరిచయమయ్యే డెబ్యూ హీరోలకైతే ఆ టెన్షన్ మామూలుగా ఉండదు, పిచ్చెక్కిస్తుంది. ఆ సమయంలో ఎవరూ ఏమీ చేయలేరు. ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం ప్రశాంతంగా నిద్రపోవడమే. నిద్ర తప్ప వారికి వేరే దిక్కు లేదు” అంటూ తన అనుభవాలను పంచుకున్నారు. ఇక నేటి తరం ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పందిస్తూ సోషల్ మీడియా ప్రభావాన్ని నాగార్జున ప్రముఖంగా ప్రస్తావించారు. “మా తొలి రోజుల సమయంలో సోషల్ మీడియా లేదు కాబట్టి మేము చాలా అదృష్టవంతులం. కానీ ఇవాళ సోషల్ మీడియా ఓ రాక్షసిలా మారింది. దానికి ఎలాంటి కనికరం ఉండదు. మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం కాదు.. దీని ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అందుకే ఈ రంగంలోకి వచ్చే కొత్త హీరోలు మానసికంగా గట్టిగా సిద్ధపడి రావాలి” అని స్పష్టం చేశారు. తొలి సినిమా టెన్షన్ నుంచి మొదలుకొని సోషల్ మీడియా ట్రోలింగ్ వరకు నాగార్జున చేసిన విశ్లేషణ సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.