Site icon NTV Telugu

Naga Babu: అలా మాట్లాడేందుకు ఏం హక్కుంది.. శివాజీ కామెంట్స్‌పై నాగబాబు ఫైర్!

Naga Babu

Naga Babu

సీనియర్ నటుడు శివాజీ ఇటీవల మహిళల డ్రెస్‌ల విషయంలో చేసిన కామెంట్స్‌ టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. శివాజీ కామెంట్స్ సోషల్ మీడియా, న్యూస్ ఛానెల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలువురు నటీమణులు స్పందించగా.. తాజాగా జ‌నసేన నేత‌, న‌టుడు నాగబాబు స్పందించారు. శివాజీ త‌న టార్గెట్ కాద‌ని, మ‌న స‌మాజంలో మోర‌ల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మ‌త ఉంద‌న్నారు. మగ అహంకారంతో ఆడ పిల్లల వస్త్రధారణపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై అలా మాట్లాడేందుకు ఏం హక్కుంది? అని నాగబాబు ప్రశ్నించారు.

‘జనసేన నేతగా, ఎమ్మెల్సీగా, రాజకీయనాయకుడిగా, ఓ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా కాదు.. ఒక సామాన్య వ్యక్తిగా ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఇటీవలి కాలంలో చాలా మంది మహిళల వస్త్రధారణపై మాట్లాడుతున్నారు. తాజాగా శివాజీ మాట్లాడాడు. నేను శివాజీని టార్గెట్‌ చేయడం లేదు. ఒకవేళ మీరు అలా అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. స‌మాజంలో మోర‌ల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మ‌త ఉంది. ఆడపిల్లలు ఎలా ఉండాలి, వాళ్లు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే విషయాలపై ప్రతి ఒక్కరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం రాజ్యాంగం ప్రకారం తప్పు’ అని నాగబాబు అన్నారు.

Also Read: 2025 Analysis: బాక్సాఫీస్ వద్ద తడబడ్డ స్టార్ హీరోలు.. సత్తా చాటిన యువ హీరోస్!

‘వస్త్రధారణ అనే ది పూర్తిగా స్త్రీల వ్యక్తిగత హక్కు. ఒక మహిళ ఎలాంటి దుస్తులు ధరించాలి అనే విషయంలో ఎవరికీ ఆదేశాలు ఇచ్చే హక్కు లేదు. ఆడవాళ్లు ఇలా మాత్రమే డ్రెస్‌లు వేసుకోవాలి అని చెప్పడానికి ఎవడికీ హక్కు లేదు. ప్రతి అమ్మాయికి ఆత్మగౌరవం ఉంటుంది. ప్రపంచంలో ఫ్యాషన్‌ ఎన్నో రకాలుగా మారుతూ ఉంటుంది. ప్రతి ఆడపిల్లను కుటుంబసభ్యురాలి మాదిరిగానే చూడండి. మగవారితో సమానంగా బతికే హక్కు మహిళలకు ఉంటుంది. మీరు ఎలాంటి దుస్తులైనా ధరించండి కానీ.. బయటకు వెళ్లేటప్పుడు మాత్రం మీ రక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నేను మగవాళ్లందరినీ తప్పు పట్టడం లేదు, కొందరి గురించి మాత్రమే చెబుతున్నా. ఇలాంటి అంశంపై స్పందించడం అందరి బాధ్యత’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.

Exit mobile version