‘ఇస్మార్ట్ బ్యూటీ’గా కుర్రకారు గుండెల్లో మంటలు రేపిన నభా నటేష్, ఒక లాంగ్ బ్రేక్ తర్వాత బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. విరాట్ కర్ణ హీరోగా, విలక్షణ దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన ఎపిక్ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. ‘నిక్ స్టూడియోస్’ బ్యానర్‌పై నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఏకంగా రూ. 110 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ విజువల్ వండర్ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ నభా నటేష్ విలేకరుల సమావేశంలో పాల్గొని, ఈ ప్రాజెక్ట్ కోసం తను చేసిన కఠినమైన ప్రయాణాన్ని, షూటింగ్ లొకేషన్ లో జరిగిన ఆసక్తికరమైన రహస్యాలను ఓపెన్ గా పంచుకుంది.
ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి నభా చెప్తూ.. “ఇప్పటివరకు నా కెరీర్‌లో గ్లామరస్ రోల్స్ ఎక్కువగా చేశాను. కానీ మొదటిసారి ‘నాగబంధం’లో ‘పార్వతి’ అనే ఒక వేద విద్యార్థిని పాత్రలో కనిపిస్తాను. తన కుటుంబం కోసం, ప్రేమ కోసం ఎంతవరకైనా తెగించే అత్యంత పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్ ఇది. కథను మలుపు తిప్పే ప్రతి మేజర్ డెసిషన్ నా పాత్ర ద్వారానే జరుగుతుంది. స్క్రీన్ పై నన్ను చూసి ఆడియన్స్ ఖచ్చితంగా షాక్ అవుతారు. నా లుక్ కోసం రోజుకు రెండు గంటల పాటు మేకప్ వేసుకునేదాన్ని” అని తెలిపింది. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ అద్భుతమైన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్ వేశారు. ఆ సెట్ లో జరిగిన షూటింగ్ అనుభవాలను నభా గుర్తుచేసుకుంది.
“ఆ అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్‌లోకి అడుగుపెడితే నిజమైన గుడిలోకి వెళ్లినట్లే ఉంటుంది. అందుకే దైవభక్తితో, ఎంతో నియమనిష్టలతో మేమంతా పనిచేశాం. షూటింగ్ జరిగినన్ని రోజులూ సెట్‌లో ఉన్నవారంతా పూర్తిగా శాకాహారులుగా మారిపోయాం. అంతేకాదు, అక్కడ ఒక అర్చకుడిని ప్రత్యేకంగా నియమించి.. ప్రతిరోజూ స్వామివారికి పూజలు నిర్వహించిన తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేసేవాళ్లం.” సినిమాలో వచ్చే డాన్స్ నంబర్స్ విజువల్ ఫీస్ట్‌లా ఉంటాయని నభా లీక్ ఇచ్చింది. “ఈ చిత్రంలో ‘నమోరే’ అనే పాటతో పాటు ఒక క్రేజీ జానపద గీతం కూడా చేశాను. ముఖ్యంగా దాదాపు 5,000 మంది డ్యాన్సర్లతో స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ ఒక సాంగ్‌ను కంపోజ్ చేశారు. బృందావనంలో గోపికలంతా కలిసి వేడుక చేసుకుంటే ఎలా ఉంటుందో.. అంతటి పండుగ వాతావరణం ఆ సాంగ్ సెట్‌లో కనిపించింది. క్లాసికల్ టచ్‌తో భక్తిభావం ఉట్టిపడేలా ఈ పాటను బిగ్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించారు” అని వెల్లడించింది.

