Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్‌ ఎందుకు సైలెంట్ అయింది!

Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur: టాలీవుడ్‌లో పద్ధతిగా కనిపిస్తూ సంప్రదాయ పాత్రలతో మెప్పించడం, అటు బాలీవుడ్‌లో గ్లామర్ పాత్రలతో అలరించడం.. ఇలా రెండు పరిశ్రమలనూ బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోయింది మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ సక్సెస్ తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా గడిపిన ఈ బ్యూటీ, గత తొమ్మిది నెలలుగా ఒక్క కొత్త ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత క్రేజ్ ఉన్న హీరోయిన్ అకస్మాత్తుగా ఎందుకు సైలెంట్ అయింది? తెరవెనుక అసలేం జరుగుతోంది? చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘ది ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద ఎదురుదెబ్బ తగిలినప్పటి నుంచే మృణాల్ స్పీడు తగ్గించిందనే టాక్ వినిపిస్తుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా నిరాశపరచడంతో ఈ ఏడాది ఆమె ఖాతాలో హాట్రిక్ డిజాస్టర్స్ వచ్చి చేరాయి. థియేటర్లలోనే కాకుండా, చాలా కాలం నిరీక్షణ తర్వాత ఓటీటీలో విడుదలైన ‘పూజా మేరీ జాన్’ సైతం ఆమెకు అనుకున్న స్థాయిలో మైలేజ్ ఇవ్వలేకపోయింది. గతంలో ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘లస్ట్ స్టోరీస్ 2’ ఇచ్చిన హైప్ ఈ సినిమాతో రిపీట్ కాలేదు. వరుస బాక్సాఫీస్ బాంబ్స్ పడటంతోనే దర్శకనిర్మాతలు మృణాల్‌ను పక్కన పెట్టారా? అవకాశాలు తగ్గిపోవడం వల్లే ఆమె ఖాళీగా ఉంటోందా అనే సందేహాలు సినీ వర్గాల్లో మొదలయ్యాయి.

అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. మృణాల్‌కు అవకాశాలు రాకపోవడం లేదని, వస్తున్న స్క్రిప్ట్‌లు ఆమెకు నచ్చకపోవడమే ఈ విరామానికి అసలు కారణమని తెలుస్తోంది. తన దగ్గరకు వస్తున్న కథలన్నీ మూసధోరణిలో, రొటీన్ ఫార్ములాతో ఉండటంతో ఆమె నిర్మొహమాటంగా ‘నో’ చెప్పేస్తోందట. కేవలం తెరపై కనిపించడం కోసమో, కెరీర్ గ్యాప్ రాకూడదన్న తొందరపాటో ఆమెలో కనిపించడం లేదు. తన నటనకు స్కోప్ ఉండి, బలమైన క్యారెక్టర్ ఆర్క్ ఉన్న మీనింగ్‌ఫుల్ స్క్రిప్ట్‌లు దొరికే వరకు వేచి చూడడానికే మృణాల్ మొగ్గు చూపుతోంది. ఫ్లాపుల్లో ఉన్నప్పుడు తొందరపడి చెత్త కథలు ఒప్పుకోవడం కంటే, సరైన కథ దొరికేవరకు గ్యాప్ తీసుకోవడమే బెటర్ అనే ఆలోచనతో ఆమె సైలెంట్ అయిందట. తన కెరీర్ గురించి వస్తున్న ఊహాగానాలపై మృణాల్ ఇప్పటికే పరోక్షంగా స్పష్టత ఇచ్చింది. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకుంటే అధికారికంగా తన సోషల్ మీడియా వేదికగానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చింది. అయితే, ప్రస్తుతం ఆమె ‘రాకా’ చిత్రంలో నటిస్తోందంటూ బలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, దానిపై మాత్రం ఆమె ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. చేస్తున్నానని చెప్పట్లేదు, అలాగని చేయట్లేదని ఖండించడమూ లేదు. కథల ఎంపికలో రాజీపడకుండా, సరైన బ్రేక్ కోసం చూస్తున్న మృణాల్ ఠాకూర్ వ్యూహం రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.